అక్కడే నా కెరీర్‌కు బీజం పడింది: కోహ్లి

2 Jan, 2020 14:45 IST|Sakshi

అతనొక డిఫరెంట్‌ ప్లేయర్‌

న్యూఢిల్లీ: తన క్రికెట్‌ కెరీర్‌కు చక్కటి పునాది పడటానికి దాదాపు 11 ఏళ్ల క్రితం జరిగిన అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఒక ప్రధాన కారణమని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పష్టం చేశాడు. తన నాయకత్వంలోని అండర్‌-19 వరల్డ్‌కప్‌ గెలుచుకున్న జ్ఞాపకాల్ని కోహ్లి నెమరువేసుకున్నాడు. తనతోపాటు ఎంతో మంది క్రికెటర్లు ఆ వరల్డ్‌కప్‌తోనే వెలుగులోకి వచ్చారని ఈ సందర్భంగా తెలిపాడు. 2008లో జరిగిన అండర్‌-19 వరల్డ్‌కప్‌లో కేన్‌ విలియమ్సన్‌, స్టీవ్‌ స్మిత్‌లు తమ తమ దేశాలకు ఆడి రాణించారన్నాడు. అయితే ఇక్కడ కేన్‌ విలియమ్సన్‌ ఒక విభిన్నమైన ఆటగాడని కోహ్లి కొనియాడాడు.

ఆ సమయంలో ఆడిన మిగతా ఆటగాళ్లతో పోలిస్తే విలియమ్సన్‌ బ్యాటింగ్‌ సామర్థ్యం చాలా డిఫరెంట్‌గా ఉండేదని కొనియాడాడు. కాకపోతే తన కెరీర్‌కు చక్కటి పునాది పడటానికి ఆ వరల్డ్‌కప్‌ తనకు ఎంతగానో ఉపయోగపడిందన్నాడు. మనకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటేనే కెరీర్‌ సజావుగా సాగుతుందన్నాడు. అందుకోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందన్న కోహ్లి.. ఈ ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌పైనే దృష్టి సారించినట్లు తెలిపాడు. 2008 అండర్‌-19 వరల్డ్‌కప్‌లో కోహ్లి సుమారు 47 సగటుతో 235 పరుగులు చేశాడు. ఆ వరల్డ్‌కప్‌ సెమీ ఫైనల్‌లో కివీస్‌పై టీమిండియా మూడు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 205 పరుగులు చేసింది. అయితే వర్షం అంతరాయం కల్గించడంతో విజయ లక్ష్యాన్ని 43 ఓవర్లలో 191 పరుగులకు కుదించారు. దాన్ని కోహ్లి నేతృత్వంలోని భారత్‌ అండర్‌-19 జట్టు ఇంకా తొమ్మిది బంతులు ఉండగా ఛేదించింది.

మరిన్ని వార్తలు