కోహ్లి గ్యాలరీ భావోద్వేగం

13 Sep, 2019 01:41 IST|Sakshi

భారత కెప్టెన్‌ పేరుతో పెవిలియన్‌

అరుణ్‌జైట్లీ స్టేడియంగా

మారిన ఫిరోజ్‌షా కోట్లా  

న్యూఢిల్లీ: ఓ కుర్రాడు 19 ఏళ్ల క్రితం మ్యాచ్‌ చూసేందుకు ఫిరోజ్‌ షా కోట్లా స్టేడియానికి వచ్చాడు. బౌండరీ బయట ఇనుప కంచె వద్దనుంచి నాటి పేసర్‌ జవగల్‌ శ్రీనాథ్‌ ఆటోగ్రాఫ్‌ తీసుకునేందుకు అతను ఎంతో ప్రయత్నించాడు. ఇప్పుడు అదే చోట తన పేరును ఏకంగా ఒక గ్యాలరీకి పెట్టేశాడు. ఇది తలచుకున్న అతను భావోద్వేగానికి గురయ్యాడు. ఆ కుర్రాడే ఇప్పటి భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి. గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ఇప్పటి వరకు ఫిరోజ్‌ షా కోట్లాగా ఉన్న ఢిల్లీ మైదానానికి కొత్తగా అరుణ్‌ జైట్లీ స్టేడియంగా పేరు మార్చారు. అలాగే ఒక స్టాండ్‌కు విరాట్‌ కోహ్లి పెవిలియన్‌  అని పేరు పెట్టారు. ఈ రెండు కార్యక్రమాలు గురువారం నెహ్రూ స్టేడియంలోని వెయిట్‌లిఫ్టింగ్‌ హాల్‌లో జరిగాయి. దీనికి భారత హోంశాఖ మంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌తో పాటు టీమిండియా సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్‌ కోహ్లి మాట్లాడుతూ ఇలాంటి అరుదైన గౌరవం నాకు లభిస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. నా భార్య, కుటుంబసభ్యుల ముందు దీన్ని ఎలా వర్ణించాలో కూడా నాకు తెలియడం లేదు. 2000 సంవత్సరంలో జింబాబ్వేతో మ్యాచ్‌ జరిగింది. నా చిన్నప్పటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మ రెండు టికెట్లు ఇవ్వడంతో సోదరుడితో కలిసి మ్యాచ్‌కెళ్లా. గ్యాలరీ నుంచి అప్పటి పేసర్‌ జవగల్‌ శ్రీనాథ్‌ ఆటోగ్రాఫ్‌ అడిగాను. ఇప్పుడదే స్టేడియంలో నా పేరుతో పెవిలియన్‌ ఉండటం చూస్తుంటే గొప్ప గౌరవంగా ఉంది అని తన మధుర జ్ఞాపకాల్ని పంచుకున్నాడు. వేదికపై కోహ్లి క్రికెట్‌ ప్రయాణానికి సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. డీడీసీఏకు జైట్లీ అందించిన సేవల్ని హోంమంత్రి అమిత్‌ షా, కపిల్‌ దేవ్‌ ఈ సందర్భంగా కొనియాడారు.

మరిన్ని వార్తలు