కోహ్లి, అండర్సన్‌ల మధ్య ఏం జరిగింది?

9 Sep, 2018 10:34 IST|Sakshi

లండన్‌:  ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియా-ఇంగ్లండ్‌ జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో రెండో రోజైన శనివారం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్ ఆండర్సన్ మధ్య మాటల యుద్ధం నడిచింది.

ఈ సంఘటన ఇన్నింగ్స్ 29వ ఓవర్‌లో చోటు చేసుకుంది. ఇందుకు కారణం కెప్టెన్ విరాట్‌ కోహ్లిని అంపైర్‌ కుమార ధర్మసేన నాటౌట్‌గా ప్రకటించడమే. అండర్సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 29వ ఓవర్లో బంతి విరాట్ కోహ్లి ప్యాడ్లను తాకింది. దీంతో అండర్సన్‌ వెంటనే అప్పీల్‌ చేసినా అంపైర్‌ ధర్మసేన అతని అప్పీల్‌ను తిరస్కరించాడు. కానీ, బంతి వికెట్లను తాకుతుందని భావించిన ఆండర్సన్ రివ్యూ కోరాడు. రివ్యూలో బంతి వికెట్లకు తాకే అవకాశం ఉన్నట్లు కనిపించినా.. థర్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని ఫీల్డ్‌ అంపైర్‌కు వదిలేశాడు. దీంతో ధర్మసేన తన నిర్ణయానికే కట్టుబడి ఉండడంతో బెన్‌ఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద కోహ్లి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో అంఫైర్ ధర్మసేన దగ్గరకు వెళ్లి కోపంగా మాట్లాడిన జేమ్స్ అండర్సన్‌.. ఆ తర్వాత విరాట్ కోహ్లి వద్దకు వెళ్లి కోపంతో ఊగిపోయాడు. దానికి కోహ్లి కూడా అంతే వేగంగా స్పందించడంతో అంఫైర్ ధర్మసేన కలగజేసుకుని ఇద్దరు ఆటగాళ్లకు సర్దిచెప్పాడు.

పట్టు చేజారినట్టే!

మరిన్ని వార్తలు