జట్టులో లేకున్నా.. ‘టాప్’ లేపాడు!

18 Dec, 2017 20:59 IST|Sakshi

దుబాయ్‌: లంకతో వన్డే సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్నా టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని కోల్పోలేదు. ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లి 876 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా విధ్వంసక ఆటగాడు ఏబీ డివిలియర్స్ రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. భారత తాత్కాలిక వన్డే, టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ తాజా ర్యాంకింగ్స్‌లో ఐదో ర్యాంకుకు ఎగబాకాడు. ఇటీవల లంకతో మొహాలీ వేదికగా జరిగిన రెండో వన్డేలో తన విశ్వరూపం రూపిస్తూ అజేయ డబుల్ సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ తాజా ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగు పరుచుకుని టాప్-5లో చేరాడు.

అజేయ ద్విశతకం బాదిన రోహిత్ ఆ మరుసటి వన్డేలో విఫలమైనా.. 800 ప్లస్ రేటింగ్ పాయింట్లను కెరీర్‌లో తొలిసారి సాధించాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 14వ ర్యాంకులో ఉన్నాడు. బౌలర్ల విషయానికొస్తే లంకతో వన్డే సిరీస్‌లో రాణించిన యుజువేంద్ర చహల్ 23 ర్యాంకులు మెరుగు చేసుకుని 28వ స్థానంలో, హార్ధిక్ పాండ్యా 45వ ర్యాంకు, చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ 16 స్థానాలు ఎగబాకి 56వ ర్యాంకులో కొనసాగుతున్నారు. ఆటగాళ్లు ర్యాంకులు మెరుగు పరుచుకున్నా.. టీమిండియా ర్యాంకులో ఎలాంటి మార్పు లేదు. 119 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. లంకతో వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేస్తే భారత్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకునేది. 120 పాయింట్లతో వన్డే ర్యాంకుల్లో దక్షిణాఫ్రికా జట్టు తన హవా కొనసాగిస్తోంది.

మరిన్ని వార్తలు