ఎంతో గర్వపడే వాడిని: గావస్కర్‌

10 Jan, 2019 10:33 IST|Sakshi
అలెన్‌ బోర్డర్‌ చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్న కోహ్లి

సిడ్నీ: ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత క్రికెట్ జట్టు అందుకున్న తరుణంలో తన కళ్లు చెమర్చాయని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ చెప్పుకొచ్చారు. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్‌ వర్షం కారణంగా ఈరోజు డ్రాగా ముగియగా.. నాలుగు టెస్టుల సిరీస్‌ని టీమిండియా 2-1తో కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన గావస్కర్‌.. భారత క్రికెట్‌ జట్టుకు ట్రోఫీని అందజేసే అవకాశం లభించివుంటే ఎంతో గర్వపడేవాడినన్నాడు. అయితే ఈ ట్రోఫీని భారత క్రికెట్‌ అందుకునే సమయంలో తన కళ్లు చెమర్చాయమన్నాడు. ‘నాకెంతో గర్వంగా ఉంది. ఆసీస్ గడ్డపై కోహ్లి సేన చరిత్రాత్మక విజయం సాధించిన ఆ సందర్భంలో నా కళ్లు చెమర్చాయి. భారత్‌కు ట్రోఫీని అందించే అరుదైన అవకాశం లభించివుంటే ఎంతో ఆనందపడేవాడిని. తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను టీమిండియా ఓడించింది. కనీసం సిడ్నీ వెళ్లివుంటే నా స్నేహితుడు అలెన్‌ బోర్డర్‌ను కలిసివుండేవాడిని’ అని పేర్కొన్నాడు.

నిజానికి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సీఈఓ జేమ్స్‌ సదర్లాండ్‌ గత మే నెలలో గావస్కర్‌కు ముందస్తు సమాచారం ఇచ్చారు. ఆ మరుసటి నెలలోనే సదర్లాండ్‌ తన పదవికి రాజీనామా చేశారు. గావస్కర్‌ముందస్తు సమాచారమైతే ఉంది కానీ అనంతరం క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి అధికారిక ఆహ్వానం మాత్రం అందలేదు. దాంతో ట్రోఫీని బోర్డర్‌ చేతులు మీదుగానే విరాట్‌ కోహ్లి అందుకున్నాడు.

మరిన్ని వార్తలు