చేయగలిగింది అంతా చేశాం: కోహ్లి భావోద్వేగం

11 Jul, 2019 11:01 IST|Sakshi

‘టీమిండియాకు మద్దతుగా నిలిచిన ప్రతీ అభిమానికి మొదటగా ధన్యవాదాలు. ఈ టోర్నీ ఆసాంతం మాకు అండగా ఉండి మాకు గుర్తుండిపోయేలా చేశారు. అదే విధంగా జట్టుపై ఎంతో ప్రేమ కురిపించారు. కానీ మనమంతా నిరాశ చెందాల్సి వచ్చింది. ఈ సమయంలో మీ భావోద్వేగాలు పంచుకోండి. విజయం కోసం మేము ఏమేమి చేయగలమో అవన్నీ చేశాం. జై హింద్‌’ అంటూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి భావోద్వేగపూరిత ట్వీట్‌ చేశాడు. ఓటమిలోనూ తమకు అండగా నిలిచిన అభిమానులకు కృతఙ్ఞతలు తెలిపాడు.  ప్రపంచకప్‌లో భాగంగా టోర్నీ ఆసాంతం అద్భుత విజయాలతో ఆకట్టుకున్న కోహ్లి సేన కథ సెమీఫైనల్‌తోనే ముగిసిన సంగతి తెలిసిందే. బుధవారం మాంచెస్టర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 18 పరుగులతో పరాజయం పాలైంది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కివీస్‌ వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరి భారత అభిమానులకు షాక్‌ ఇచ్చింది.

ఈ క్రమంలో ఓటమిపై స్పందించిన కోహ్లి మాట్లాడుతూ.. ‘ టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడి ఒక్క 45 నిమిషాల చెత్త ఆటతో జట్టు బోల్తా పడటం చాలా నిరాశ పరిచింది. టోర్నీలో జోరుమీదున్న మేం ఇలాంటి అనూహ్య ఫలితంతో నిష్క్రమించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. కివీస్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. జడేజా అసాధారణ ఆటతీరు కనబరిచాడు. తన క్రికెట్‌ నైపుణ్యాన్ని చాటాడు. ధోనితో విలువైన భాగస్వామ్యం జోడించాడు. ధోని ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకే నింపాదిగా ఆడాడు. మరోవైపు జడేజా యథేచ్చగా ఆడేందుకు స్ట్రయికింగ్‌తో సాయపడ్డాడు. ఒకవేళ ఆఖర్లో ధోని రనౌట్‌ కాకపోతే ఫలితం మరోలా ఉండేది. అయితే అతను తన రిటైర్మెంట్‌పై మాకేమీ చెప్పలేదు అని పేర్కొన్నాడు. ఇక టీమిండియా ఓటమిపై కోట్లాది మంది అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా తమ భావాలను పంచుకుంటున్నారు.

>
మరిన్ని వార్తలు