‘రోహిత్‌ కాదు.. కోహ్లినే’

4 Jun, 2020 16:10 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ఇటీవల కాలంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఓపెనర్‌ రోహిత్‌ శర్మల బ్యాటింగ్‌పైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టినట్లున్నారు మాజీ క్రికెటర్లు. కోహ్లి,రోహిత్‌ల బ్యాటింగ్‌ను పోలుస్తూ ఎవరు గొప్ప అనే చర్చ గత కొంతకాలంగా నడుస్తూ ఉంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌ కూడా చేరిపోయాడు. వీరిద్దరిలో ఎవరు గొప్ప అనే దానిపై తనదైన కోణంలో విశ్లేషించాడు హాగ్‌. ప్రధానంగా భారీ టార్గెట్లను టీమిండియా చేజింగ్‌ చేసేటప్పుడు ఎవరు ఎక్కువ నిలకడగా ఆడతారు అనే దానిపై వివరణ ఇచ్చాడు. ఈ విషయంలో రోహిత్‌ కంటే కోహ్లినే ఎంతో నిలకడైన ఆటగాడని హాగ్‌ చెప్పుకొచ్చాడు. (‘బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ’ని మళ్లీ చూద్దామా!)

క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్స్‌కు సమాధానమిచ్చిన హాగ్‌కు కోహ్లి-రోహిత్‌ల్లో ఎవరు ఉత్తమం అనే ప్రశ్న ఎదురైంది. ప్రత్యేకంగా వైట్‌బాల్‌ క్రికెట్‌(పరిమిత ఓవర్ల క్రికెట్)లో ఎవరు మంచి ఆటగాడని అనుకుంటున్నారు అని ఒక అభిమాని ప్రశ్నించాడు. దీనికి బదులిచ్చిన వీడియోను తన అధికారిక యూట్యూబ్‌ చానెల్‌లో హాగ్‌ పోస్ట్‌ చేశాడు. ఇక్కడ కోహ్లిని ఉత్తమం అని హాగ్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘ కోహ్లినే ఉత్తమం. కచ్చితంగా కోహ్లినే. ఎందుకంటే కోహ్లి నిలకడైన ఆటగాడు. ప్రధానంగా భారీ పరుగుల టార్గెట్‌ను చేజ్‌ చేసేటప్పుడు కోహ్లి చాలా నిలకడగా ఆడతాడు’ అని తెలిపాడు. కానీ ఈ ఇద్దర్నీ పోల్చడం అంత సరైనది కాదన్నాడు. వీరిద్దరూ తమ తమ పాత్రలకు న్యాయం చేస్తూ జట్టును ఉన్నత స్థానంలో నిలబెడతారన్నాడు. కొత్త బంతితో బౌలింగ్‌ చేసే బౌలర్లకు రోహిత్‌ ఒక ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్‌ అని అన్నాడు. (బాల్కనీ నుంచి దూకేద్దామనుకున్నా: ఊతప్ప)

>
మరిన్ని వార్తలు