సెహ్వాగ్‌ రికార్డు బ్రేక్‌ చేసిన కోహ్లి

5 Oct, 2018 13:20 IST|Sakshi
విరాట్‌ కోహ్లి

పలు రికార్డులు నమోదు చేసిన భారత కెప్టెన్‌

రాజ్‌కోట్‌ : వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ రెండో రోజు ఆటలో భారత తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తొలి రోజు ఆటలో యువకెరటం పృథ్వీ షా సెంచరీ చేయగా.. పుజారా(86) ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు.  కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మాత్రం విండీస్‌కు చాన్స్‌ ఇవ్వకుండా కెరీర్‌లో 24వ సెంచరీ సాధించాడు. తద్వారా టెస్ట్‌ల్లో వేగంగా (123 ఇన్నింగ్స్‌లో) 24వ శతకాలు సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు. టెస్ట్‌ చరిత్రలో డాన్‌ బ్రాడ్‌మన్‌ ఒక్కడే 66 ఇన్నింగ్స్‌లో 24 సెంచరీలు సాధించాడు. 

అత్యధిక టెస్ట్‌ సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో కోహ్లి వీరేంద్ర సెహ్వాగ్‌ను అధిగమించి నాలుగో స్థానంలో నిలిచాడు. 51 సెంచరీలతో సచిన్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, ద్రవిడ్‌ (36), సునీల్‌ గవాస్కర్‌ (34)లు కోహ్లి కన్నా ముందు ఉన్నారు. ఇక సెహ్వాగ్‌ 23 సెంచరీలతో కోహ్లి తర్వాతి స్థానంలో నిలిచాడు. 72 టెస్టుల్లో కోహ్లి 24 సెంచరీలు సాధించగా 103 టెస్టుల్లో సెహ్వాగ్‌ 23 సెంచరీలు పూర్తి చేశాడు. ఇంగ్లండ్‌ పర్యటననంతరం విశ్రాంతి తీసుకున్న కోహ్లి తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు.

ఇక వెస్టిండీస్‌పై కోహ్లికి ఇది రెండో సెంచరీ కాగా.. సొంతగడ్డపై 11వది కావడం విశేషం. గత మూడు టెస్ట్‌ సిరీస్‌ల్లో అద్భుతంగా రాణించిన కోహ్లి ఈ ఏడాదే అప్పుడే (1003) వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా సొంతగడ్డపై టెస్టుల్లో మూడువేల పరుగులు సాధించాడు. వరుసగా మూడేళ్లు వెయ్యికి పైగా పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మాథ్యూ హెడెన్‌ ఒక్కడే 2001-2005 వరకు వరుసగా ఐదుసార్లు వెయ్యికి పైగా పరుగులు సాధించి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. స్టీవ్‌ స్మిత్‌ (2014-17)మధ్య నాలుగు సార్లు, కోహ్లి(2016-2018) మూడు సార్లు, బ్రియాన్‌ లారా(2003-2005), పీటర్సన్‌ (2006-2008)లు మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు.

చదవండి: కనీసం చెప్పలేదు: మురళీ విజయ్‌ ఆవేదన

మరిన్ని వార్తలు