ఓటేయడానికి నేను సిద్ధం..మరి మీరు : కోహ్లి

28 Apr, 2019 14:37 IST|Sakshi

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మే 12న తాను గురుగ్రామ్‌లో ఓటువేస్తున్నాని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పేర్కొన్నాడు. ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్న కోహ్లి.. తొలుత అక్కడే ఓటు వేయాలని భావించాడు. ఈ నేపథ్యంలో నిర్ణీత గడువు ముగిసేలోగా ఓటరు కార్డు కోసం అప్లై చేయకపోవడంతో ఈ ఎన్నికల్లో అతడు ఓటు వేసే అవకాశం కోల్పోయాడని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లి అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో.. ‘ మే 12న గురుగ్రామ్‌లో ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు’ అంటూ కోహ్లి తన ఓటరు ఐడీ కార్డును ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేశాడు. ఈ నేపథ్యంలో మైదానంలో పరుగుల వరద పారించే కోహ్లి... అందరికీ ఆదర్శంగా నిలిచే ఏ అవకాశాన్ని కూడా వదులుకోడని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ శాతం పెంచేందుకు సెలబ్రిటీలంతా ముందుకొచ్చి ప్రజలను చైతన్యవంతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.  ఇందులో భాగంగా... ‘ క్రికెట్‌ మైదానంలో అద్భుత ప్రదర్శనతో ఎన్నో రికార్డులు నెలకొల్పుతావు. అయితే ఈసారి 130 కోట్ల మంది భారతీయులను చైతన్యవంతం చేసి.. పోలింగ్‌ శాతాన్ని పెంచే సరికొత్త రికార్డు నెలకొల్పాల్సి ఉంది. ఇలా జరిగితేనే ప్రజాస్వామ్యం గెలుస్తుంది’ అని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి ప్రత్యేక విఙ్ఞప్తి చేశారు. ఢిల్లీకి చెందిన కోహ్లి ప్రస్తుతం తన భార్యతో కలిసి ముంబైలో నివసిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడే ఓటరుగా నమోదు చేయించుకోవాలనుకున్నాడు. కానీ నిర్ణీత సమయంలోగా దరఖాస్తు సమర్పించలేకపోయాడు.

ఈ విషయం గురించి ఎన్నికల సంఘం సీనియర్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ విరాట్‌ కోహ్లి అప్లికేషన్‌ ఆలస్యంగా అందింది. అందుకే పెండింగ్‌లో పెట్టాము. ఈ దఫా లోక్‌సభ ఎన్నికల్లో అతడు ఓటు వేయలేడు. వచ్చే ఎన్నికల దాకా వేచి చూడాల్సిందే.  వర్లీ నివాసిగా ముంబైలో ఓటరుగా నమోదు చేయించుకోవాలనుకున్నాడు. అతడి టీమ్‌ కూడా ఇందుకోసం తీవ్రంగా శ్రమించింది. కానీ సమయం మించిపోయినందు వల్ల కోహ్లి ఓటువేయడం సాధ్యం కాదు’ అని పేర్కొన్నారు. అయితే తన పాత ఓటరు కార్డుతో ప్రస్తుతం కోహ్లి గురుగ్రామ్‌లో ఓటు వేయనున్నాడు.

మరిన్ని వార్తలు