ధోని సేవలు వెలకట్టలేనివి: కోహ్లి

16 May, 2019 18:24 IST|Sakshi

ముంబై: టీమిండియా సారథిగా, వికెట్‌ కీపర్‌గా మహేంద్ర సింగ్‌ ధోని అందించిన సేవలు వెలకట్టలేనివని విరాట్‌ కోహ్లీ అన్నాడు. ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘నా క్రికెట్‌ కెరీర్‌ మొదలైంది ధోనీ సారథ్యంలోనే. కొన్నేళ్లుగా అతడిని దగ్గర నుంచి చూస్తున్నా. ధోనీ జట్టులో ఉండటం ఎంతో ముఖ్యం. అతడు గేమ్‌ ఛేంజర్‌. ఇటీవల ఐపీఎల్‌లోనూ అతడేంటో చూశాం. జట్టులో ప్రతి ఒక్కరూ బాగా రాణించాలంటే ధోనీ సలహాలు, సూచనలు ఎంతో అవసరం’ అని తెలిపాడు.

ఇక ప్రపంచ కప్‌లో రిషభ్‌ పంత్‌కు బదులు దినేశ్‌ కార్తీక్‌ను ఎంచుకోవడం పైనా విరాట్‌ మాట్లాడాడు. ‘మ్యాచ్‌లో జట్టు ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పుడు దినేశ్‌ కార్తీక్‌ అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది. దినేశ్‌ ఎన్నోసార్లు మ్యాచ్‌ను గట్టెక్కించాడు. ఫినిషర్‌గానూ అతడు అద్భుతం. ఇదే విషయాన్ని సెలక్షన్‌ కమిటీలోని ప్రతి ఒక్కరూ అంగీకరించారు. అందుకే అతనివైపు మొగ్గాం. ఆటగాళ్లలో 15 మందిని జట్టుకు ఎంపిక చేయడం అంత సులభం కాదు’ అని పేర్కొన్నాడు. కాగా, 2004లో వన్డేల్లో అరంగేట్రం చేసిన కార్తీక్‌ ఇప్పటి వరకు 91 వన్డేలు, 26 టెస్టులు ఆడాడు.  

మరిన్ని వార్తలు