హ్యాట్సాఫ్‌ మ్యాన్‌: కోహ్లి ప్రశంసలు

23 Dec, 2019 10:34 IST|Sakshi

కటక్‌:  వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. విండీస్‌ నిర్దేశించిన 316 పరుగుల టార్గెట్‌ను విరాట్‌ గ్యాంగ్‌ 48.4 ఓవర్లలో ఆరు వికెట్ల కోల్పోయి ఛేదించి ఏడాదిని విజయంతో ముగించింది. ఈ మ్యాచ్‌లో రాహుల్‌ (89 బంతుల్లో 77; 8 ఫోర్లు, 1 సిక్స్‌), రోహిత్‌ (63 బంతుల్లో 63; 8 ఫోర్లు, 1 సిక్స్‌) లు  సాధించిన అర్ధ సెంచరీలు ఒక ఎత్తయితే, కోహ్లి  (81 బంతుల్లో 85; 9 ఫోర్లు) ఆడిన ఇన్నింగ్స్‌ మరొక ఎత్తు. ఇదంతా ఒకటైతే చివర్లో ఫాస్ట్‌ బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ ఆడిన ఇన్నింగ్స్‌  మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.(ఇక్కడ చదవండి: టీమిండియా రికార్డులు.. విశేషాలు)

మ్యాచ్‌ను భారత్‌ కోల్పోతుందా అనే సమయంలో వచ్చిన ఠాకూర్‌ క్రీజ్‌లోకి రావడంతో బ్యాట్‌ ఝుళిపించి  మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. కీమో పాల్‌ వేసిన 47 ఓవర్‌ తొలి బంతికి కోహ్లి ఔట్‌  కాగా, ఆపై క్రీజ్‌లోకి వచ్చిన శార్దూల్‌ తాను ఆడిన తొలి బంతినే బౌండరీకి పంపించాడు. ఇక కాట్రెల్‌ వేసిన 48 ఓవర్‌ మూడో బంతిని సిక్స్‌ కొట్టిన శార్దూల్‌.. ఆ ఓవర్‌ నాల్గో బంతిని ఫోర్‌ కొట్టాడు. 6 బంతులు ఆడి 2 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో అజేయంగా 17  పరుగులు  సాధించడంతో భారత్‌ ఇంకా ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే సునాయాసంగా గెలుపొందింది.

మ్యాచ్‌ తర్వాత జడేజా-శార్దూల్‌ ఠాకూర్‌లు గ్రౌండ్‌లో కలిసిన సమయంలో వీరిని కోహ్లి అభినందించాడు. ప్రత్యేకంగా ఠాకూర్‌ను భుజంపై  పదే పదే చేతితో తడుతూ అతని ఆటను ప్రశంసించాడు. అటు తర్వాత తన ట్వీటర్‌ అకౌంట్‌లో సైతం శార్దూల్‌ను కోహ్లి కొనియాడాడు.  మహరాష్ట్రకు చెందిన శార్దూల్‌ను మరాఠీ భాషలో ప్రశంసించాడు.  ‘తులా మాన్లా రే ఠాకూర్‌(హ్యాట్సాఫ్‌ ఠాకూర్‌)’ అంటూ పొగిడాడు. ఇలా శార్దూల్‌ను కోహ్లి ప్రశంసించడంపై ట్వీటర్‌లో అభిమానులు తమ గొంతు కలుపుతున్నారు. ఇదొక అద్భుత  ఇన్నింగ్స్‌ అంటూ శార్దూల్‌ ఆటను ప్రశంసిస్తున్నారు. తన చివరి శ్వాస వరకూ ఠాకూర్‌కు తానే ఫ్యాన్‌గా ఉంటానని ఒక అభిమాని ట్వీట్‌ చేశాడు.(ఇక్కడ చదవండి: కలిసి కట్టుగా...పది పట్టగా...)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు