కెప్టెన్ X కెప్టెన్

26 Jun, 2015 00:20 IST|Sakshi
కెప్టెన్ X కెప్టెన్

‘కెప్టెన్సీలో ఎవరి శైలి వాళ్లది. ఎవరి ఆలోచనలు, వ్యూహాలు వాళ్లకుంటాయి. అందరూ ఒకేలా ఉండాలని ఆశించకూడదు’... బంగ్లాదేశ్‌తో టెస్టు తర్వాత కోహ్లి కెప్టెన్సీ గురించి ధోని వ్యాఖ్య
‘తొలి రెండు వన్డేల్లో నిర్ణయాలు తీసుకోవడంలో జట్టులో ఒకరకమైన సందిగ్ధత కనపడింది. అదే మైదానంలో ప్రతిఫలించింది. ఇది నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మ్యాచ్ చూసిన వాళ్లందరికీ అర్థమైంది’ మూడో వన్డేకు ముందు కోహ్లి వ్యాఖ్య ఇది.
 ఈ రెండు వ్యాఖ్యలు గమనిస్తే భారత క్రికెట్ జట్టులో అంతా సవ్యంగా ఉందని అనుకోగలమా..?

 
టెస్టు, వన్డే సారథుల మధ్య విభేదాలున్నాయా?
సాక్షి క్రీడా విభాగం: ఏ జట్టులో అయినా సహచరుడి గురించి అడిగినప్పుడు మొహమాటానికైనా ప్రతి క్రికెటర్ ప్రశంసిస్తూనే మాట్లాడతాడు. టెస్టుల నుంచి రిటైరైన ధోని... కోహ్లి గురించి అడిగినప్పుడు బాగా చేశాడనో, ఇంకా ఇలా చేయొచ్చనో చెబితే అయిపోయేది. కానీ సమాధానంలో కనీసం ధోని పేరు ప్రస్తావించకుండా మాట్లాడాడు. పదే పదే ఐదుగురు బౌలర్ల గురించి కోహ్లి మాట్లాడటం మహీకి నచ్చలేదు. తన శైలి ధోనికి భిన్నమని చెప్పే ప్రయత్నం టెస్టు సమయంలో కోహ్లి చేశాడు.

మూడో వన్డేకు ముందు ఇంటర్వ్యూలో కోహ్లి మాట్లాడుతూ పరోక్షంగా ధోనిని విమర్శించాడు. పేరు చెప్పకపోయినా వ్యూహాల గురించి మాట్లాడటమంటే ధోని గురించే అని అందరికీ అర్థమైంది. వన్డేల్లో వ్యూహాల విషయంలో కోహ్లి మాటను లెక్క చేయకపోవడం, కలుపుకోకుండా పక్కకు బెట్టడం వల్ల ఇలా మాట్లాడి ఉంటాడనేది ఓ అంచనా. దీంతో కోహ్లి తన అసంతృప్తిని బాహాటంగానే వెలిబుచ్చాడు.
 
విరాట్‌లో విశ్వాసం పెరిగింది!
భారత క్రికెట్‌లో సమస్యలు, వివాదాలు వచ్చినా, వరుస పరాజయాలు వెంటాడినా గతంలో ఎవరూ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆటలోనే కాకుండా మాటల్లో కూడా దూకుడుకు మారు పేరైన కోహ్లి.... ఇప్పుడు అనూహ్యంగా తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. బంగ్లాతో సిరీస్‌లో ఆటగాళ్లు స్వేచ్ఛగా తమ ఆటను ప్రదర్శించలేకపోయారని, గతంలో ఇలా ఎప్పుడూ లేదని అతను అన్నాడు. తొలి సారి ధోని గైర్హాజరీలో టెస్టు జట్టుకు నాయకత్వం వహించిన వెంటనే కోహ్లినుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. రవిశాస్త్రి అన్నింటా అండగా ఉండటంతో అతనిలో  ఆత్మ (అతి) విశ్వాసం పాలు ఒకింత ఎక్కువగానే కనిపిస్తోంది. పైగా శ్రీనివాసన్ అండతో హవా చలాయించిన ధోనిపై గుర్రుగా ఉన్న బోర్డు పెద్దలు కొందరు కోహ్లికి మద్దతు ఇవ్వడం వల్లే ఇంత బహిరంగంగా అతను వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు.
 
స్వతంత్రంగా ధోని
వరల్డ్‌కప్‌లో కీలక మ్యాచ్‌లలో విఫలమైనా... అంతకు ముందు బ్రిస్బేన్ టెస్టు సందర్భంగా ధావన్‌తో జరిగిన గొడవ విషయంలోనూ కోహ్లిని ధోని వెనకేసుకొచ్చాడు. గతంలో మైదానంలో సూచనలు, సలహాల విషయంలో కోహ్లి కూడా ధోనితో కలిసి చురుగ్గా పాల్గొన్నాడు. అయితే ఇప్పుడు పరిణామాలు మారాయి. దిగ్గజాలు జట్టులో ఉన్న సమయంలో కూడా టీమ్‌ను నడిపించిన మహీకి... తన సమక్షంలోనే కోహ్లి దూసుకుపోయే ప్రయత్నం రుచించట్లేదు. ముఖ్యంగా రెండో వన్డే కోసం అనూహ్యంగా చేసిన మూడు మార్పుల నేపథ్యంలోనే ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లు సమాచారం.  
 
కలిసి పని చేస్తారా?
సాధారణంగా కొత్త కెప్టెన్ ఎవరు వచ్చినా... తన వర్గాన్ని తయారు చే సుకోవడం, నమ్మిన బంటులుగా మార్చుకొని ప్రోత్సహించడం ఎప్పుడూ జరిగేదే. రైనా, అశ్విన్, జడేజా, మోహిత్ అలా ధోని గ్యాంగ్ అనే ముద్రతో ఉన్నారు. కొత్తగా కోహ్లి ఇదే ప్రయత్నంలో ఉన్నట్లున్నాడు. ఆ జోరులో కాస్త ‘అతి’ ప్రదర్శించబోతే ధోని అడ్డు పడినట్లు అతని వ్యాఖ్యల్లో కనిపిస్తోంది. ఈ ఏడాది భారత్ విరామం లేకుండా చాలా సిరీస్‌లు ఆడనుంది.  వీరిద్దరి మధ్య ఎలాంటి సమన్వయం ఉంటుంది? కలిసి పని చేయగలుగుతారా అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం వస్తుంది.

మరిన్ని వార్తలు