సిరీస్‌ ఓటమిపై స్పందించిన కెప్టెన్‌ కోహ్లీ

17 Jan, 2018 17:00 IST|Sakshi

సెంచూరియన్‌: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో వచ్చిన ఫలితమే సెంచూరియన్‌ టెస్టులోనూ పునరావృతమైంది. 287 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 151 పరుగులకే ఆలౌట్‌ కావడంతో మరో టెస్ట్‌మిగిలుండగానే టీమిండియా 0-2 తేడాతో సఫారీలకు సిరీస్‌ కోల్పోయిన విషయం తెలిసిందే. సిరీస్‌ ఓటమి అనంతరం భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. టాస్‌కు ముందు చూసిన పిచ్‌, ప్రస్తుతం ఉన్న వికెట్‌కు చాలా వ్యత్యాసముందని జట్టు ఆటగాళ్లకు హెచ్చరించాను. వికెట్‌ చాలా ఫ్లాట్‌గా ఉంది. పరుగులు తీయడం తేలిక అని భావించాను. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా తొలుత త్వరత్వరగా వికెట్లు కోల్పోవడంతో పరిస్థితి అర్థమైంది. కానీ మా బ్యాటింగ్‌లో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలం కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సంపాదించలేకపోయాం అన్నాడు కోహ్లీ.

తొలి ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో చేసిన సెంచరీపై కోహ్లీ మాట్లాడుతూ.. ‘సెంచరీ చేసినా ఏం లాభం జట్టు ఓడిపోయింది కదా. జట్టు గెలుపు కోసం చేసిన 30 లేక 50 పరుగులైనా నాకు ఆనందాన్నిస్తాయి. జట్టు గెలవని సందర్భంలో నా వ్యక్తిగత మైలురాళ్లను పట్టించుకోను. మైదానంలో కాలుపెట్టానంటే దేశం కోసం పూర్తిస్థాయిలో రాణించేందుకు శ్రమిస్తాను. బౌలర్లు అద్భుతంగా రాణించారు. కానీ బ్యాట్స్‌మెన్‌ వైఫల్యాలతో సిరీస్‌ చేజార్చుకున్నాం. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించడం వల్లే విజయం వారి సొంతమైంది. సఫారీలు టీమిండియా కంటే మెరుగ్గా ఆడారు. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో వారి నైపుణ్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. ఓటమి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని’  పేర్కొన్నాడు. నామమాత్రమైన మూడో టెస్ట్‌ మ్యాచ్‌ జొహన్నెస్‌బర్గ్‌ వేదికగా జనవరి 24 నుంచి ప్రారంభం కానుంది.

మరిన్ని వార్తలు