విధేయతకే  ప్రాధాన్యతనిస్తా

19 Apr, 2019 04:52 IST|Sakshi

ధోని పట్ల తన వైఖరిని చెప్పిన కెప్టెన్‌ కోహ్లి

న్యూఢిల్లీ: కెరీర్‌ ఆరంభంలో తనను ప్రోత్సహించిన అప్పటి సారథి మహేంద్ర సింగ్‌ ధోనిపై ప్రస్తుత భారత జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. భారత జట్టుకు ధోని అమూల్యమైన సంపద అని పేర్కొన్నాడు. గత కొంత కాలంగా వన్డే ఫార్మాట్‌లో ధోని విఫలమైన సందర్భాల్లో అతని ఫామ్‌పై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లి తన మాజీ కెప్టెన్‌కు అండగా నిలిచాడు. తన మద్దతు ఎప్పుడూ ధోనికే ఉంటుందని పునరుద్ఘాటించాడు. ‘చాలామంది ధోని భాయ్‌ ఫామ్‌పై అనవసర సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. నావరకైతే నేను విధేయతకే ప్రాధాన్యతనిస్తా. నా కెరీర్‌ తొలినాళ్లలో కెప్టెన్‌గా మహి భాయ్‌ అందించిన ప్రోత్సాహాన్ని మరవలేను. నేను విఫలమైన సందర్భాల్లో ధోనికి వేరే ప్రత్యామ్నాయం ఉన్నప్పటికీ నాపై నమ్మకంతో నన్ను ప్రోత్సహించాడు.

సాధారణంగా యువ క్రికెటర్లకు నంబర్‌–3లో ఆడే అవకాశం రాదు. కానీ ధోని భాయ్‌ నాకు ఆ అవకాశాన్ని కల్పించాడు. అదే నాకు మేలు చేసింది’ అని కోహ్లి తన కెరీర్‌ తొలినాళ్లను గుర్తు చేసుకున్నాడు. ఇప్పటికి కూడా ధోనిలా మ్యాచ్‌ పరిస్థితులను అంచనా వేయడంలో తనకు సాటి ఎవరూ లేరని కితాబిచ్చాడు. కీలక సమయాల్లో ధోని సలహాలే జట్టుకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పాడు. ‘తొలి బంతి నుంచి చివరి బంతి వరకు మ్యాచ్‌ గమనాన్ని తెలుసుకోగల ఏకైక వ్యక్తి ధోని. వికెట్ల వెనకాల అతనిలాంటి మేధావి ఉండటం నా అదృష్టంగా భావిస్తా. డెత్‌ ఓవర్లలో నేను ఔట్‌ఫీల్డ్‌లో పరిస్థితి చక్కదిద్దుతుంటే... ధోని భాయ్‌ బౌలింగ్, ఫీల్డింగ్‌ సంగతి చూస్తాడు’ అని కోహ్లి వివరించాడు. ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేసిన జట్టుపై కోహ్లి హర్షం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌ ఆడుతున్నప్పటికీ అందరి దృష్టి ప్రపంచకప్‌పైనే ఉందన్నాడు.

మరిన్ని వార్తలు