విరాట్‌ విజయం @ 28 

4 Sep, 2019 05:10 IST|Sakshi

అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా గుర్తింపు  

రెండో టెస్టులోనూ విండీస్‌ చిత్తు 

257 పరుగులతో టీమిండియా విక్టరీ  

2–0తో సిరీస్‌ సొంతం   

భారత్‌ తిరుగులేని ప్రదర్శనకు మరో భారీ విజయం దక్కింది. తొలి టెస్టులాగే రెండో మ్యాచ్‌లోనూ వెస్టిండీస్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా మరో గెలుపుతో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లో 120 పాయింట్లతో శిఖరాన నిలబడింది. కోహ్లి సేన సమష్టి బౌలింగ్‌ ప్రదర్శన ముందు విండీస్‌ చేవలేని బ్యాటింగ్‌ మళ్లీ తలవంచింది. ఫలితంగా కరీబియన్‌ పర్యటనలో మూడు ఫార్మాట్‌లలోనూ ఒక్క మ్యాచ్‌ కూడా ఓడకుండా మూడు సిరీస్‌లనూ కైవసం చేసుకొని వెనుదిరిగింది.

సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇదే కింగ్‌స్టన్‌ గడ్డపై విరాట్‌ కోహ్లి కెరీర్‌ తొలి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. ఇప్పుడు అదే వేదికపై మరో అరుదైన ఘనతతో సగర్వంగా నిలబడ్డాడు. తాజా ఫలితంతో భారత టెస్టు కెప్టెన్‌గా అతని ఖాతాలో 28వ విజయం చేరింది. దీంతో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా ధోని (27)ని వెనక్కి నెట్టి కోహ్లి అగ్రస్థానానికి చేరుకున్నాడు. 48వ టెస్టులోనే ఈ ఘనత సాధించి రాబోయే రోజుల్లో మరిన్ని మైలురాళ్లను చేరుకునేందుకు సిద్ధమయ్యాడు.    

కింగ్‌స్టన్‌ (జమైకా): టెస్టుల్లో తమ బలాన్ని చూపిస్తూ భారత జట్టు విండీస్‌ గడ్డపై మరో సిరీస్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో టెస్టులో టీమిండియా 257 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. 468 పరుగుల అసాధ్యమైన విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో రోజు విండీస్‌  రెండో ఇన్నింగ్స్‌లో 59.5 ఓవర్లలో 210 పరుగులకే ఆలౌటైంది. బ్రూక్స్‌ (119 బంతుల్లో 50; 9 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. జడేజా, షమీ చెరో 3 వికెట్లు పడగొట్టగా, ఇషాంత్‌కు 2 వికెట్లు దక్కాయి. తొలి టెస్టులో 318 పరుగుల తేడాతో నెగ్గిన టీమిండియా సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. ఇదే టూర్‌లో టి20, వన్డే సిరీస్‌ లు కూడా భారత్‌ ఖాతాలోనే చేరాయి. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీ సాధించిన విహారి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌ షిప్‌కు సంబంధించి ఈ సిరీస్‌లో అందుబాటులో ఉన్న 120 పాయింట్లు భారత్‌ ఖాతాలో చేరాయి.  

బ్రూక్స్‌ మినహా... 
తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ భరతం పడితే... రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్ల సమష్టి ప్రదర్శన భారత్‌కు విజయాన్ని అందించింది. మ్యాచ్‌ మూడో రోజే ఓపెనర్లను కోల్పోయి ఓటమికి బాటలు వేసుకున్న విండీస్‌ నాలుగో రోజు నిలవలేకపోయింది. ఆదివారం 46.5 ఓవర్లు ఆడి మిగిలిన ఎనిమిది వికెట్లు కోల్పోయి టీ విరామానికి ముందే భారత్‌కు తలవంచింది. ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో బ్రూక్స్, బ్లాక్‌వుడ్‌ (38; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఆరో వికెట్‌కు 61 పరుగులు జోడించడమే చెప్పుకోదగ్గ అంశం. ఇది మినహా ఆ జట్టు బ్యాటింగ్‌ ఎప్పటిలాగే పేలవంగా సాగింది. 14 ఓవర్ల పాటు భారత బౌలింగ్‌ను నిరోధించిన అనంతరం ఛేజ్‌ (12)ను జడేజా ఎల్బీగా అవుట్‌ చేయడంతో విండీస్‌ పతనం ప్రారంభమైంది. ఈ దశలో కొంత అదృష్టం కూడా కలిసొచ్చి బ్రూక్స్, బ్లాక్‌వుడ్‌ నిలబడ్డారు. లంచ్‌ తర్వాత బ్లాక్‌వుడ్‌ను అవుట్‌ చేసి బుమ్రా ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. కోహ్లి చక్కటి ఫీల్డింగ్‌తో బ్రూక్స్‌ రనౌట్‌ కాగా, మరో రెండు బంతులకు హామిల్టన్‌ (0) పెవిలియన్‌ చేరాడు. మరో ఎండ్‌లో కెప్టెన్‌ హోల్డర్‌ (35 బంతుల్లో 39; 9 ఫోర్లు) ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నించినా అది ఎక్కువ సేపు సాగలేదు.

స్కోరు వివరాలు 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 416; వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌:117; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 168/4 డిక్లేర్డ్‌; వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌: క్యాంప్‌బెల్‌ (సి) కోహ్లి (బి) షమీ 16, బ్రాత్‌వైట్‌ (సి) పంత్‌ (బి) ఇషాంత్‌ 3; బ్రేవో (రిటైర్డ్‌హర్ట్‌) 23; బ్రూక్స్‌ (రనౌట్‌) 50; ఛేజ్‌ (ఎల్బీ) (బి) జడేజా 12; హెట్‌మైర్‌ (సి) మయాంక్‌ (బి) ఇషాంత్‌ 1; బ్లాక్‌వుడ్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 38; హోల్డర్‌ (బి) జడేజా 39; హామిల్టన్‌ (సి) రాహుల్‌ (బి) జడేజా 0; కార్న్‌వాల్‌ (సి) పంత్‌ (బి) షమీ 1; రోచ్‌ (సి) పంత్‌ (బి) షమీ 5; గాబ్రియెల్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (59.5 ఓవర్లలో ఆలౌట్‌) 210  
వికెట్ల పతనం: 1–9, 2–37, 2–55 (రిటైర్డ్‌హర్ట్‌), 3–97, 4–98, 5–159, 6–177, 7–177, 8–180, 9–206, 10–210. బౌలింగ్‌: ఇషాంత్‌  శర్మ 12–3–37–2, బుమ్రా 11–4–31–1, షమీ 16–2–65–3, జడేజా 19.5–4–58–3, విహారి 1–0–3–0.  

మరో సాధికారిక ప్రదర్శనతో మేం అనుకున్న భారీ విజయాన్ని అందుకున్నాం. ఈ రోజు అత్యుత్తమ భారత కెప్టెన్‌గా నిలవగలిగానంటే జట్టు సభ్యులందరు, వారి అత్యుత్తమ ఆటనే కారణం. పేరుకు ముందు ‘సి’ అని ఉండటం తప్ప నా దృష్టిలో కెప్టెన్‌ ప్రత్యేకం ఏమీ కాదు. మా బ్యాట్స్‌మెన్‌ బాగా ఆడితే బౌలర్లు అద్భుతంగా చెలరేగారు. ఈ సిరీస్‌ సమష్టి విజయం. పిచ్‌ పరిస్థితిని బట్టి చూస్తే ఈ టెస్టులో విహారి ఇన్నింగ్స్‌ అత్యుత్తమం. అతను ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. విహారి బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు డ్రెస్సింగ్‌ రూమ్‌లో మేమెంతో ప్రశాంతంగా కూర్చున్నాం. తప్పులు సరిదిద్దుకునేందుకు, ఆటను మెరుగుపర్చుకునేందుకు అతను ఎప్పుడూ వెనుకాడడు. ప్రాణం పెట్టి ఆడే రకం. జట్టు కోసం ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉంటాడు. ఇంత స్వల్ప కెరీర్‌లోనే విహారికి జట్టు ఎందుకు మద్దతునిస్తోందో అతను చూపించాడు.   
 కోహ్లి  

మరిన్ని వార్తలు