విరాట్‌ కోహ్లి ‘హ్యాట్రిక్‌’ రికార్డు

31 Dec, 2018 12:01 IST|Sakshi

మెల్‌బోర్న్‌: అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో రికార్డులపై రికార్డు కొల్లగొడుతూ దూసుకుపోతున్న క్రికెటర్‌ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి. అటు కెప్టెన్‌గా, ఇటు బ్యాట్స్‌మన్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకుని క్రికెట్‌లో అతనే ఒక పెద్ద సూపర్‌స్టార్‌ అనేంతగా కితాబులు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మరో అరుదైన ఫీట్‌ను కోహ్లి నెలకొల్పాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డు సాధించాడు. 2018 అంతర‍్జాతీయ క్రికెట్‌లో కోహ్లి 2,653 పరుగులతో ఎవ్వరికీ అందనంత ఎత‍్తులో నిలిచాడు. సుమారు 70 సగటుతో కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఇందులో అత్యధిక స్కోరు 160.

ఫలితంగా వరుసగా మూడో ఏడాది కూడా అత్యధిక అంతర్జాతీయ పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. 2016లో 2,595 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన కోహ్లి.. 2017లో 2,818 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగించిన కోహ్లి ‘హ్యాట్రిక్‌’ పరుగుల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో టెస్టులో భారత్‌  విజయం సాధించి ఈ ఏడాదిని ఘనంగా ముగించిన సంగతి తెలిసిందే. దాంతో విదేశాల్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో సౌరవ్‌ గంగూలీతో కలిసి కోహ్లి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఇది కోహ్లికి 11వ విదేశీ టెస్టు విజయం.

మెల్‌బోర్న్‌లో మువ్వన్నెలు 

మరిన్ని వార్తలు