ఎందుకు మూల్యం చెల్లించుకున్నామంటే..: కోహ్లి

23 Sep, 2019 12:12 IST|Sakshi

బెంగళూరు: సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ గెలవాలన్న టీమిండియా ఆశలు నెరవేరలేదు. ఆదివారం జరిగిన చివరి టీ20లో సఫారీలు జూలు విదిల్చి ఘన విజయాన్ని సాధించడంతో సిరీస్‌ సమంగా ముగిసింది. అయితే దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోవడంపై సర్వత్రా విమర్శలు  వచ్చాయిం. ఛేజింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ముందుగా బ్యాటింగ్‌ తీసుకోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే మ్యాచ్‌ తర్వాత కోహ్లి కూడా తమది తప్పుడు నిర్ణయమేనని పరోక్షంగా ఒప్పుకున్నాడు.

‘గేమ్‌ పరిస్థితిని కచ్చితంగా అంచనా వేయలేకపోయాం. టాస్‌  గెలిచి బ్యాటింగ్‌ చేయడం మాకు అనుకూలించలేదు. కొన్ని సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇవ్వవు. ఇప్పుడు మాకు అదే జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోవడంతో మాకు ప్రతికూల ఫలితం వచ్చిందనే విషయాన్ని కూడా కాదనలేం. తదుపరి మ్యాచ్‌ల్లో దీన్ని పునరావృతం చేయం. పిచ్‌ను అంచనా వేయడంలో విఫలమయ్యామనే అనుకుంటున్నా. ఇందులో మేము ఇంకా మెరుగవ్వాలి’ అని కోహ్లి పేర్కొన్నాడు.

ఇక దక్షిణాఫ్రికా సమిష్టి ప్రదర్శనపై కోహ్లి ప్రశంసలు కురిపించాడు. ఆ జట్టులో ప‍్రతీ ఒక్కరూ ఆకట్టకోవడంతో  మేము మ్యాచ్‌ను సులభంగా కోల్పోయాం. ముఖ్యంగా మమ్మల్ని  సాధారణ పరుగులకే కట్టడి చేసిన సఫారీ బౌలర్లకే మొత్తం క్రెడిట్‌ దక్కుతుంది. మ్యాచ్‌ తొలి భాగంలో సఫారీ బౌలర్లకు పిచ్‌ అనుకూలించింది. ఓవరాల్‌ పిచ్‌ పరిస్థితిని సఫారీలు  బాగా వినియోగించుకున్నారు’ అని కోహ్లి తెలిపాడు. తాము ప్రస్తుతం యువ క్రికెటర్ల సత్తాను పరీక్షిస్తున్నామని, దానిలో భాగంగానే పలువురికి అవకాశాలు ఇస్తున్నామన్నాడు. వారంత దేశవాళీ మ్యాచ్‌ల్లో ఆకట్టుకున్న విషయాన్ని కోహ్లి ఈ సందర్భంగా ప్రస్తావించాడు. యువ క్రికెటర్లను పరీక్షిస్తున్నప్పటికీ ఏ గేమ్‌ను తేలిగ్గా తీసుకోవడం లేదన్నాడు.

మరిన్ని వార్తలు