ఆ సంఘటనే వ్యక్తిగా మార్చింది: కోహ్లి

11 May, 2016 05:30 IST|Sakshi
ఆ సంఘటనే వ్యక్తిగా మార్చింది: కోహ్లి

న్యూఢిల్లీ:  క్రికెటర్‌గా ఒక వ్యక్తి ఎంతో సంతోషాన్ని అనుభవించి ఉండొచ్చు. కానీ దాని వెనుక అంతులేని విషాదాలు కూడా దాగి ఉంటాయి. ఇలాంటి సంఘటనను స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి 18 ఏళ్ల వయసులోనే అనుభవించాడు. 19 డిసెంబర్ 2006 తెల్లవారుజామున కోహ్లి తండ్రి ప్రేమ్... హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. ఆ సమయంలో విరాట్ ఢిల్లీ తరఫున కర్ణాటకతో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడుతున్నాడు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్‌గా 40 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అప్పటికి ఢిల్లీ జట్టుకు ఫాలో ఆన్ ప్రమాదం పొంచి ఉంది. కానీ తండ్రి మరణ వార్తను గుండెల్లోనే అదిమి పెట్టుకుని క్రీజులో అడుగుపెట్టిన కోహ్లి 90 పరుగులు చేసి జట్టును గట్టెక్కించాడు.

కష్టకాలంలో కూడా విరాట్ ఎంత బాధ్యతాయుతంగా ఆడతాడో చెప్పడానికి ఈ సంఘటన ఒక్కటి చాలు. తండ్రి చనిపోయిన దశాబ్దం తర్వాత కోహ్లి... తనను వ్యక్తిగా మార్చిన ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ‘మా నాన్న చనిపోయిన ఆ రోజు రాత్రి నాకు ఇంకా గుర్తుంది. నా జీవితంలోనే అదో కఠినమైన సమయం. నా తండ్రి మరణం సహజంగానే వచ్చినా.. ఉదయం మ్యాచ్ ఆడాలన్న బాధ్యత కూడా నాపై ఉంది. ఉదయమే నా కోచ్ పిలిచి అడిగినా ఆడతాననే చె ప్పా. ఎందుకంటే మ్యాచ్‌ను మధ్యలో వదిలేసిపోవడం భావ్యం అని పించలేదు. ఆ క్షణమే నన్ను ఓ వ్యక్తిగా మార్చింది. ఈ బాధ్యతే నన్ను ఆటలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లింది’ అని కోహ్లి వివరించాడు.
 
 

మరిన్ని వార్తలు