అందుకే ధావన్‌ను ఉంచాం : కోహ్లి

14 Jun, 2019 12:31 IST|Sakshi
విరాట్‌ కోహ్లి

లండన్‌ : గాయపడ్డ టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ స్థానంలో అధికారికంగా ప్రత్యామ్నయ ఆటగాడిని తీసుకోకపోవడానికి గల కారణాన్ని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వెల్లడించాడు. వేచి చూసే ధోరణిలో భాగంగానే శిఖర్‌ను జట్టుతో కొనసాగిస్తున్నామని కోహ్లి స్పష్టం చేశాడు. టోర్నీలోని కీలక సమయాల్లో అతని ఓపెనింగ్‌ సేవలను వినియోగించుకోవాలని జట్టు మేనేజ్‌మెంట్‌ భావిస్తుందని తెలిపాడు. బుధవారం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ రద్దైన అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘లీగ్‌ మ్యాచ్‌ల చివరి దశలో లేదా సెమీస్‌కు ధావన్‌ తప్పకుండా అందుబాటులోకి వస్తాడు. అందుకే మేం అతని జట్టుతో ఉంచుకున్నాం. అతనికి ఆడాలనే కసి ఎక్కువ. అదే అతన్ని గాయం నుంచి కోలుకునేలా చేస్తుంది. ధావన్‌ చేతికి కొన్ని వారాల పాటు ప్లాస్టర్‌ తప్పనిసరి. గాయం నుంచి కోలుకున్న అనంతరం అతని సేవలు మేం ఉపయోగించుకుంటాం.’ అని కోహ్లి పేర్కొన్నాడు.

ధావన్‌ గాయంతో యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఇంగ్లండ్‌ పయనమైనప్పటికీ అతను జట్టులో చేరలేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక ఆటగాడు గాయపడిన తర్వాత అతను పూర్తిగా జట్టు నుంచి బయటకు వెళ్లిపోతేనే అతని స్థానంలో మరో ఆటగాడిని టెక్నికల్‌ కమిటీ అనుమతిస్తుంది. ప్రస్తుతం పంత్‌ జట్టుతో ఉండకుండా మాంచెస్టర్‌లో ఉంటాడని, ప్రస్తుతానికి పంత్‌ ‘స్టాండ్‌ బై’ మాత్రమేనని, ధావన్‌ స్థానంలో ఎంపిక చేయలేదని బీసీసీఐ ప్రకటించింది. ఇక ధావన్‌ గాయంపై ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ.. ధావన్‌కు అయిన గాయంతో అతని బ్యాటింగ్‌కు ఇబ్బంది లేదు. లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పటికి సహజసిద్దంగా అతను కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌. కాకపోతే ఈ గాయం అతని ఫీల్డింగ్‌, క్యాచ్‌లు పట్టుకోవడంపై ప్రభావం చూపుతోంది.’ అని తెలిపాడు.

చదవండి: శిఖర్‌ ధావన్‌ తీవ్ర కసరత్తు

మరిన్ని వార్తలు