అందుకే ఓడిపోయాం: కోహ్లి

11 Feb, 2018 13:31 IST|Sakshi
మ్యాచ్‌ తర్వాత కోహ్లిని ఇంటర్య్వూ చేస్తున్న షాన్‌ పొలాక్‌

జోహన్నెస్‌బర్గ్‌:దక్షిణాఫ్రికాతో జరిగిన నాల్గో వన్డేలో కూడా గెలిచి సిరీస్‌ను ముందుగానే సాధించాలనుకున్న భారత జట్టుకు నిరాశే ఎదురైంది. వరుసగా మూడు వన్డేలు ఓడి.. సిరీస్‌ కోల్పోయే ప్రమాదంలో పడ్డ సమయంలో సఫారీలకు కొన్ని అంశలు కలిసొచ్చాయనే చెప్పాలి. తొలుత మ్యాచ్‌పై వర్షం ప్రభావం పడగా, ఆపై భారత జట్టు తమకు వచ్చిన అవకాశాల్ని చేజార్చుకోంది. ప్రధానంగా డేవిడ్‌ మిల్లర్‌ ఒకే ఓవర్‌లో రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవడం భారత జట్టు విజయంపై ప్రభావం చూపింది. దీనితో భారత కెప్టెన్‌ కోహ్లి కూడా ఏకీభవించాడు.

మ్యాచ్‌ తర్వాత మాట్లాడిన కోహ్లి..' మాకు వచ్చిన అవకాశాల్ని చేజార్చుకున్నాం. ఏబీ అవుటైన తర్వాత మ్యాచ్‌లో విజయం ఖాయమని అనుకున్నాం. మిల్లర్‌- క్లాసెన్‌లు విజయాన్ని మాకు దూరం చేశారు. మా నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. యజ్వేంద్ర చాహల్‌ బౌలింగ్‌ మిల్లర్‌ ఇచ్చిన డీప్‌ స్వ్కేర్‌ లెగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ వదిలేస్తే, అదే ఓ‍వర్‌లో మిల్లర్‌ బౌల్డ్‌ అయినప్పటికీ ఆ బంతి నో బాల్‌ అయ్యింది. దాంతో మాకు విజయావకాశాలు సన్నగిల్లాయి. మరొకవైపు వర్షం కూడా మా విజయాన్ని దూరం చేసిందనే చెప్పాలి. వర్షం కారణంగా మ్యాచ్‌ ఒక్కసారిగా టీ20 తరహాలో మారిపోయింది. ఇవన్నీ ఫలితం మాకు ప్రతికూలంగా మారడానికి కారణం. తదుపరి వన్డేల్లో ఎటువంటి పొరపాట్లు చేయకుండా విజయాన్ని సొంతం చేసుకుంటామనే ఆశిస్తున్నా' అని కోహ్లి పేర్కొన్నాడు. నాల్గో వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 289 పరుగులు చేసింది. అయితే పదే పదే వర్షం కురవడం వల్ల సఫారీల లక్ష్యం 28 ఓవర్లలో 202కు మారడం ఆ జట్టుకు వరమైంది. చేతిలో వికెట్లు ఉండటంతో  దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ టీ 20 తరహాలో ఆడి జట్టును 25.3 ఓవరల్లో 207 పరుగులు చేసి గెలిపించారు.

మరిన్ని వార్తలు