కోహ్లికే కిరీటం

19 Jan, 2018 00:55 IST|Sakshi

ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా ఎంపిక

వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు కూడా 

రెండు జట్లకూ కెప్టెన్‌గా అరుదైన గౌరవం

టెస్ట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా స్మిత్‌

దుబాయ్‌: గత రెండేళ్లుగా పరుగుల వరద పారిస్తూ ప్రపంచ క్రికెట్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తున్న భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి సముచిత బహుమతి లభించింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రకటించిన వార్షిక అవార్డుల్లో కోహ్లి ‘ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా ఎంపికయ్యాడు. దిగ్గజ ఆల్‌రౌండర్‌ సర్‌ గార్‌ఫీల్డ్‌ సోబర్స్‌ పేరిట ఇచ్చే ఈ అవార్డును తొలిసారి కోహ్లి అందుకోనున్నాడు. భారత్‌ తరఫున గతంలో ద్రవిడ్, సచిన్, అశ్విన్‌ దీనిని గెల్చుకున్నారు. ఇక 50 ఓవర్ల ఫార్మాట్‌లో తిరుగులేని ప్రదర్శన కనబర్చి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన కోహ్లి ‘వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఐసీసీ టెస్టు, వన్డే జట్లలో స్థానం లభించడంతో పాటు ఆ రెండు టీమ్‌లకు కూడా అతనే కెప్టెన్‌గా ఎంపిక కావడం కోహ్లికి లభించిన మరో అరుదైన గౌరవం. మరో ప్రధాన అవార్డు ఐసీసీ ‘టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కు లభించింది. ఇంగ్లండ్‌పై భారత యువ లెగ్‌స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ బౌలింగ్‌ (6/25) 2017 టి20 అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఎమర్జింగ్‌ క్రికెటర్‌ అవార్డు హసన్‌ అలీ (పాకిస్తాన్‌)కు దక్కగా... అఫ్ఘానిస్తాన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ అసోసియేట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా ఎంపికయ్యాడు.  

పరుగుల ప్రవాహం... 
అవార్డు ఎంపికకు సెప్టెంబర్‌ 21, 2016 నుంచి డిసెంబర్‌ 31, 2017 మధ్య కాలాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సమయంలో కోహ్లి 18 టెస్టుల్లో 77.80 సగటుతో 2,203 పరుగులు సాధించాడు. వీటిలో ఎనిమిది సెంచరీలు (ఆరు డబుల్‌ సెంచరీలు), మూడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 31 వన్డేల్లో 82.63 సగటుతో 1,818 పరుగులు సాధించాడు. ఏడు సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. వీటికి తోడు టి20ల్లో 153 స్ట్రైక్‌రేట్‌తో 299 పరుగులు కూడా చేశాడు. మరోవైపు స్టీవ్‌ స్మిత్‌ ఇదే సమయంలో 16 టెస్టుల్లో 78.12 సగటుతో 1,875 పరుగులు చేసి టెస్టు క్రికెటర్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు. స్మిత్‌ మొత్తం ఎనిమిది సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు సాధించాడు. కోహ్లి గతంలో 2012లో ‘వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డును గెలుచుకున్నాడు.  

మరో నలుగురు... 
ఐసీసీ టెస్టు ఎలెవన్, వన్డే ఎలెవన్‌ జట్లను కూడా ప్రకటించింది. టెస్టు జట్టులో భారత్‌ తరఫున చతేశ్వర్‌ పుజారా, రవిచంద్రన్‌ అశ్విన్‌లకు చోటు లభించింది. మూడో డబుల్‌ సెంచరీతో చెలరేగిన రోహిత్‌ శర్మ, పేస్‌ అస్త్రం జస్‌ప్రీత్‌ బుమ్రా వన్డే టీమ్‌లోకి ఎంపికయ్యారు. వార్నర్, స్టోక్స్, డి కాక్‌ రెండు జట్లలోనూ ఉన్నారు.  
ఐసీసీ టెస్టు ఎలెవన్‌:  కోహ్లి (కెప్టెన్‌), ఎల్గర్, వార్నర్, స్మిత్, పుజారా, స్టోక్స్, డి కాక్, అశ్విన్, స్టార్క్, రబడ, అండర్సన్‌.  
ఐసీసీ వన్డే ఎలెవన్‌: కోహ్లి (కెప్టెన్‌), వార్నర్, రోహిత్‌ శర్మ, బాబర్‌ ఆజమ్, డివిలియర్స్, డి కాక్, స్టోక్స్, బౌల్ట్, హసన్‌ అలీ, రషీద్‌ ఖాన్, బుమ్రా.

గతంలో ఐసీసీ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్లు...
∙రాహుల్‌ ద్రవిడ్‌ (క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్, టెస్టు క్రికెటర్‌ – 2004)  
∙యువరాజ్‌ సింగ్‌ (టి20 పెర్ఫార్మెన్స్‌ ఆఫ్‌ ద ఇయర్‌ – 2008) 
∙మహేంద్ర సింగ్‌ ధోని (వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌– 2008, 2009;  స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌–2011, పీపుల్స్‌ చాయిస్‌ అవార్డ్‌ – 2013)  
∙గౌతం గంభీర్‌ (టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌– 2009) 
∙సచిన్‌ టెండూల్కర్‌ (క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్, పీపుల్స్‌ చాయిస్‌ అవార్డ్‌–2010) 
∙వీరేంద్ర సెహ్వాగ్‌ (టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ఇయర్‌–2010) 
∙విరాట్‌ కోహ్లి (వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌–2012)  
∙చతేశ్వర్‌ పుజారా (ఎమర్జింగ్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌–2013)  
∙భువనేశ్వర్‌ కుమార్‌ (పీపుల్స్‌ చాయిస్‌ అవార్డ్‌–2014)  
∙రవిచంద్రన్‌ అశ్విన్‌ (క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్, టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌–2016)  
∙2007లో జులన్‌ గోస్వామి ఐసీసీ ఉమెన్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు దక్కించుకోగా... 2010లో ఐసీసీ టెస్టు టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా భారత్‌ ఎంపికైంది.

తొలిసారి సర్‌ గార్‌ఫీల్డ్‌ సోబర్స్‌ అవార్డుకు ఎంపిక కావడం గొప్పగా అనిపిస్తోంది. ప్రపంచ క్రికెట్‌లో ఇది అతి పెద్ద అవార్డు. వరుసగా రెండేళ్లు దీనిని భారత ఆటగాళ్లే (గత ఏడాది అశ్విన్‌) గెలుచుకోవడం మరింత ప్రత్యేకంగా ఉంది. దీనిని సొంతం చేసుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. 2016 సంవత్సరం నా కెరీర్‌లో కీలక మలుపు. ఆ జోరును తర్వాతి ఏడాది కూడా కొనసాగిస్తూ మరింత ఎక్కువగా కష్టపడ్డాను. కాబట్టి 2017కు నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది. నా దృష్టిలో ఇది నా అత్యుత్తమ దశ. భవిష్యత్తులో కూడా ఇంత బాగా ఆడేందుకు మరింతగా కష్టపడతాను. మా జట్టు తరఫున మంచి ప్రదర్శన ఇచ్చేందుకు మేం పడిన శ్రమను గుర్తించినందుకు ఐసీసీకి నా కృతజ్ఞతలు. ఇతర విజేతలకు కూడా నా అభినందనలు. 
– విరాట్‌ కోహ్లి స్పందన   

>
మరిన్ని వార్తలు