అందుకే ఓడిపోయాం: కోహ్లి

3 Sep, 2018 08:24 IST|Sakshi
విరాట్‌ కోహ్లి

సౌతాంప్టన్‌: కఠిన పరిస్థితుల్లో ఇంగ్లండ్‌ తమ కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చిందని, అందుకే తాము ఓడిపోయామని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయపడ్డాడు. నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ 60 పరుగుల తేడాతో గెలిచి ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌ అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘కఠిన పరిస్థితుల్లో వారు మాకంటే మెరుగైన ప్రదర్శన కనబర్చారు. ముఖ్యంగా వారి లోయరార్డర్‌ అద్భుతం. కరణ్‌ అద్బుతంగా రాణించాడు. ఇలాంటి పిచ్‌పై 245 పరుగుల టార్గెట్‌ నెలకొల్పడమే గొప్పవిషయం. అదే మా విజయవకాశాలను దూరం చేసింది. మా తప్పిదాల గురించి ఆలోచించడం లేదు. కానీ ఈ మ్యాచ్‌ క్రెడిట్‌ వాళ్లదే. తమ వికెట్లు కుప్పకూలుతాయని ఊహించలేదు. ఛేజింగ్‌ కాబట్టి భారీ భాగస్వామ్యం నెలకొల్పాలని భావించాం. కానీ మాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. రెండు ఇన్నింగ్స్‌లో నేను ఔట్‌వ్వడం మా విజయంపై ప్రభావం చూపింది. తొలి ఇన్నింగ్స్‌లో పుజారా అద్భుతంగా ఆడి ఆధిక్యం అందించాడు.  రెండో ఇన్నింగ్స్‌లో రహానే పరిస్థితుల తగ్గట్టు ఆడాడు. ఈ మ్యాచ్‌లో మా ఆటపై అంతగా నెగటీవ్‌ ఏం లేదు. సానుకూల దృక్పథంతో ఫైనల్‌ మ్యాచ్‌పై దృష్టిసారిస్తాం’ అని వ్యాఖ్యానించాడు.

ఓవల్‌ టెస్ట్‌ ప్రదర్శననే పునరావృతం చేశామని ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ తెలిపాడు. తాము పక్కకేసిన టవల్‌ కాదని, ఇదోక కాంపిటేటివ్‌ సిరీస్‌ అని, ఓవల్‌ గేమ్‌ స్పూర్తితో నెలకు కొట్టిన బంతిలా పుంజుకున్నామన్నాడు. విరాట్‌ కోహ్లి (130 బంతుల్లో 58; 4 ఫోర్లు), అజింక్య రహానే (159 బంతుల్లో 51; 1 ఫోర్‌) అర్ధ సెంచరీలు సాధించినా ఇతర బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మొయిన్‌ అలీ (4/71) చెలరేగగా... అండర్సన్, స్టోక్స్‌ చెరో 2 వికెట్లతో చెలరేగడంతో భారత్‌ సిరీస్‌ కోల్పోయింది.

చదవండి: సిరీస్‌ సమర్పయామి

>
మరిన్ని వార్తలు