ఆ బెంగ లేదు : కోహ్లి

9 Jul, 2019 09:35 IST|Sakshi
విరాట్‌ కోహ్లి

మాంచెస్టర్ ‌: ప్రపంచకప్‌లో భారీ స్కోర్లు సాధించలేదనే బెంగ తనకు లేదని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తెలిపాడు. జట్టు అవసరాలకు అనుగుణంగా ఆడుతున్నట్లు స్పష్టం చేశాడు. ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మైదానం వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రీ-మ్యాచ్‌ కాన్ఫరెన్స్‌లో కోహ్లి మాట్లాడాడు. ‘నేను భారీ స్కోర్లు సాధించలేదనే బెంగ లేదు. ఈ ప్రపంచకప్‌లో జట్టు అవసరాలకు అనుగుణంగా నేను భిన్నమైన పాత్ర పోషిస్తున్నాను. మధ్య ఓవర్లలో ఒకవైపు పాతుకుపోయి ఇన్నింగ్స్‌ను నడిపించాల్సిన నా బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తే తర్వాత వచ్చే పాండ్యా, పంత్, ధోని, కేదార్‌లాంటివాళ్లు భారీ షాట్లతో చెలరేగిపోతారు. భారీ ఆరంభం లభించినప్పుడు అవసరమైతే మూడో స్థానంలో కూడా వేరేవారిని పంపిస్తాను తప్ప నేనే ఆడాలనేమీ లేదు. పరిస్థితిని బట్టి మారడం ముఖ్యం. దాని వల్లే మ్యాచ్‌లు గెలుస్తూ వచ్చాం. ధోని అంటే మాకందరికీ అపార గౌరవం ఉంది. మాపై బలవంతంగా ఏమీ రుద్దకుండా మాకు మార్గదర్శిగా పని చేయడం చిన్న విషయం కాదు. 

2008 అండర్‌–19 ప్రపంచకప్‌లో విలియమ్సన్‌ను నా బౌలింగ్‌లో ఔట్‌ చేయడం ఇంకా గుర్తుంది. అవసరమైతే ఇప్పుడు మళ్లీ బౌలింగ్‌ చేస్తాను. నేను చాలా ప్రమాదకరమైన బౌలర్‌ని. కాకపోతే బౌలింగ్‌ చేయడం లేదంతే. మా ఐదుగురు బౌలర్లు తమ పనిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అందుచేత నేను బౌలింగ్‌కు దూరంగా ఉన్నా’ అని కోహ్లి నవ్వులు పూయించాడు.  న్యూజిలాండ్‌ జట్టులో కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌లతో పాటు రాస్‌ టేలర్‌లే కీలకమన్నాడు. వీరిద్దర్నీ తొందరగా పెవిలియన్‌కు పంపి కివీస్‌పై ఒత్తిడి తీసుకొస్తామని కోహ్లి ధీమా వ్యక్తం చేశాడు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్‌ అద్భుత రికార్డులు సొంతం చేసుకున్నాడని కొనియాడాడు. అతను మరో రెండు సెంచరీలు కూడా సాధిస్తాడని కోహ్లి ఆశాభావం వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు