నా అభిప్రాయం చెప్పడం సరైంది కాదు: కోహ్లి

4 Jan, 2020 19:57 IST|Sakshi

న్యూఢిల్లీ: అసోంలో తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాబోవని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పేర్కొన్నాడు. తమ భద్రతకు వచ్చే ముప్పేమీ లేదని, గువాహటిని సురక్షితం నగరంగా భావిస్తున్నట్లు తెలిపాడు. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌కు టీమిండియా సమాయత్తమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గువాహటిలో ఆదివారం జరుగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా తలపడనుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసోంలో తీవ్రస్థాయిలో ఆందోళనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దాదాపు 3 వేల మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిరనసల్లో హింసకు పాల్పడ్డారంటూ 190 మందిని అరెస్టు చేశారు. దీంతో అసోం మొత్తం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో టీమిండియా గువాహటిలోని బర్సాపరా స్టేడియంలో తొలి మ్యాచ్‌ ఆడనుంది. (రోహిత్‌ లేడు.. ఇక ఆ రికార్డు కోహ్లిదే!)

ఈ నేపథ్యంలో అసోం క్రికెట్‌ అసోసియేషన్‌ ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేసింది. ప్రేక్షకులు కేవలం మొబైల్‌ ఫోన్లు, పర్సులు మాత్రమే తీసుకువచ్చేందుకు అనుమతినిచ్చింది. ఈ క్రమంలో అసోంలో నెలకొన్న పరిస్థితి గురించి విరాట్‌ కోహ్లి మాట్లాడుతూ... ‘ ఈ విషయంలో(సీఏఏ) నేను బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాలనుకోవడం లేదు. ఇరు వర్గాల అభిప్రాయాలను పరిగణించాల్సి ఉంటుంది. ఈ అంశంపై నాకు పూర్తి సమాచారం అందలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నా అభిప్రాయం చెప్పడం సరైంది కాదు. గువాహటి సురక్షితమైన నగరమని తెలుసు. మాకు అక్కడ ఎటువంటి ఇబ్బందలు తలెత్తవు’అని పేర్కొన్నాడు. ఇ​క టెస్టు మ్యాచ్‌లను నాలుగు రోజులకు కుదించాలనే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ప్రతిపాదనపై కోహ్లి విముఖత వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా ఏళ్లుగా టెస్టుల్లో ఐదు రోజుల విధానం అమల్లో ఉందని, దాన్ని అలాగే కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు.(ఐసీసీ ప్రతిపాదనకు కోహ్లి నో)

>
మరిన్ని వార్తలు