నా సెంచరీ గురించి మాట్లాడటం వృథా : కోహ్లి

18 Dec, 2018 11:54 IST|Sakshi

పెర్త్‌ : ఓటమి తర్వాత వ్యక్తిగత ప్రదర్శనల గురించి మాట్లాడటం అనవసరమని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్‌ 146 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘జట్టుగా మేం బాగానే ఆడాం. కానీ ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాకంటే అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. ఈ పిచ్‌పై 330 పరుగులు చాలా ఎక్కువ. వారు విజయానికి అర్హులు. మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. పిచ్‌ను పరిశీలించినప్పుడు మాకు జడేజా గుర్తుకు రాలేదు. ఆ సమయంలో నలుగురు పేసర్లు చాలు అనుకున్నాం. కానీ నాథన్‌ అద్భుతంగా రాణించాడు. ఓడినప్పుడు వ్యక్తిగత ప్రదర్శనల గురించి ప్రస్తావించడం అసంబద్ధం. నా వికెట్‌ విషయంలో అంపైర్‌ నిర్ణయంపై కూడా స్పందించడం వృథా. అది మైదానంలో జరిగింది. అక్కడే వదిలేయాలి. ప్రస్తుతం నా దృష్టంతా తదుపరి మ్యాచ్‌పైనే.’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు.  

ఇక ఈ విజయంపై ఆసీస్‌ కెప్టెన్‌ టీమ్‌ పైన్‌ సంతోషం వ్యక్తం చేశాడు. తమ ఆటగాళ్లు సమష్టిగా రాణించడంతోనే ఇది సాధ్యమైందన్నాడు. నాథన్‌ లయన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడని, ప్రతీ జట్టు ఇలాంటి స్పిన్నర్‌ను కోరుకుంటుందని చెప్పుకొచ్చాడు. ఇది చాలా కఠినమైన మ్యాచ్‌ అని, ఇరు జట్లు మంచి పేస్‌బలగంతో పోటీ పడ్డాయన్నాడు. ఈ విజయం పట్ల గర్వంగా ఉందని,  ఉస్మాన్‌ ఖాజా చాలా సేపు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడని కొనియాడాడు. ఇక బాల్‌ ట్యాంపరింగ్‌ ఘటన అనంతరం ఆసీస్‌ టెస్ట్‌ల్లో తొలి విజయాన్ని నమోదు చేయడం గమనార్హం.

చదవండి: కోహ్లిసేన ఓటమికి కారణాలివేనా?

మరిన్ని వార్తలు