రిటైరయ్యాక మళ్లీ బ్యాట్‌ పట్టను

11 Jan, 2019 21:44 IST|Sakshi

లీగ్‌ టోర్నీలపై ఆసక్తి లేదు

భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ

సిడ్నీ: తాను ఒక్కసారి ఆటకు గుడ్‌బై చెబితే తిరిగి బ్యాట్‌ పట్టబోనని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ స్పష్టం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించినప్పటికీ ప్రస్తుతం చాలామంది ఆటగాళ్లు లీగ్‌ టోర్నీలు ఆడుతుండటం తెలిసిందే. అయితే, తాను మాత్రం ఆ కోవలోకి చేరబోనని పేర్కొన్నాడు. ఒక్కసారి అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించాక ఇక మ్యాచ్‌ల వైపు కన్నెత్తయినా చూడనని అంటున్నాడు.

ఆసీస్‌తో వన్డే సిరీస్‌ నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోహ్లీ పాల్గొని మాట్లాడాడు. ‘అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పాక తిరిగి మైదానం వైపు కన్నెత్తయినా చూడను. లీగ్‌ టోర్నీలు ఆడటానికి నాకు ఆసక్తి లేదు. ఇప్పటివరకు సరిపడా క్రికెట్‌ ఆడేశాను. గత ఐదేళ్లలో నేను ఆడాలనుకున్న దానికంటే ఎక్కువే ఆడాను. రాబోయే మ్యాచ్‌లనూ బాగానే ఆడతాను. ఇప్పుడు ఇంతకంటే ఎక్కువగా ఏం మాట్లాడలేను. వీడ్కోలు పలికాక మాత్రం ఇక బ్యాట్‌ ఎత్తుకోను’ అని తెలిపాడు.

మరిన్ని వార్తలు