అందుకే ఓడిపోయాం: కోహ్లి

12 Jan, 2019 16:47 IST|Sakshi
విరాట్‌ కోహ్లి

సిడ్నీ : ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోవడం.. చివర్లో రోహిత్‌కు అండ దొరకకపోవడంతోనే ఓటమి చవిచూశామని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయపడ్డాడు. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘ఈ రకమైన ఆటను మేం సమర్థించుకోం. ఈ మ్యాచ్‌లో బంతితో బాగానే రాణించామని అనుకుంటున్నా. ఎందుకంటే 300పైగా పరుగులు వచ్చే ఈ పిచ్‌లో ప్రత్యర్థిని 288కే పరిమితం చేశాం. కానీ ఆరంభంలోనే వరుసగా మూడు వికెట్లు కోల్పోవడం ఎప్పటికీ మంచిది కాదు. రోహిత్‌ అద్భుత ఆటకు ధోని మద్దతివ్వడంతో మాకు విజయావకాశాలపై ఆశలు చిగురించాయి. కానీ ధోని ఔట్‌ అవ్వడంతో రోహిత్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. రోహిత్‌కు అండగా మరో మంచి భాగస్వామ్యం నమోదైతే విజయం దక్కేది. కానీ ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోవడం  మా కొంపముంచింది. ఆసీస్‌ మా కంటే బాగా ఆడి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఫలితంతో మేం ఎలాంటి ఒత్తిడికి లోనవ్వడం లేదు. ఇలాంటి ఫలితాలు జట్టుగా ఇంకా మెరుగవ్వాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తాయి’ అని చెప్పుకొచ్చాడు. 

ఇక ఆసీస్‌ నిర్దేశించిన 289 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి  254 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ(133;129 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు)  సెంచరీ సాధించినప‍్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. జట్టు స్కోరును పెంచే క్రమంలో రోహిత్‌ ఏడో వికెట్‌గా ఔటయ్యాడు.  రోహిత్‌కు జతగా ఎంఎస్‌ ధోని(51; 96 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌) మినహా ఎవరూ రాణించలేదు. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ ఐదు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది.

మరిన్ని వార్తలు