పృథ్వీషాలో 10 శాతం కూడా ఆడలేదు: కోహ్లి

15 Oct, 2018 20:27 IST|Sakshi
విరాట్‌ కోహ్లి

హైదరాబాద్‌ : యువ సంచలనం పృథ్వీషా వయసులో ఉన్నప్పుడు అతని ఆటలో తాము 10 శాతం కూడా ఆడలేదని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయపడ్డాడు. హైదరాబాద్‌ టెస్ట్‌ విజయానంతరం మాట్లాడుతూ.. యువ ఆటగాళ్లు రిషబ్‌ పంత్‌, పృథ్వీషాలపై ప్రశంసల జల్లు కురిపించాడు. భవిష్యత్తు ఆస్ట్రేలియా పర్యటనకు దొరికిన కొత్త ఆయుధాలని కొనియాడాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు చాలా సహజంగా ఆడారని, వారికి వచ్చిన అవకాశాలను అద్భుతంగా అందిపుచ్చుకున్నారని సంతోషం వ్యక్తం చేశాడు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనే విషయం తెలుసని, భవిష్యత్తులో కఠిన పరిస్థితులు ఎదుర్కొంటారని తెలిపాడు. కానీ టెస్ట్‌ క్రికెట్‌లో ఆటను అర్థం చేసుకోని.. ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే పరుగులు చేయగలమని చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో ఈ యువ ఆటగాళ్లు విజయవంతమయ్యారని కోహ్లి తెలిపాడు.

వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను భారత్‌ 2-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన పృథ్వీషా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’  గా నిలిచాడు. దీంతో ఈ అవార్డు పొందిన పదో క్రికెటర్‌గా, భారత్‌ నుంచి నాలుగో క్రికెటర్‌గా షా గుర్తింపు పొందాడు. ఇక రిషభ్‌ పంత్‌ రెండు టెస్ట్‌ల్లో 92 పరుగులతో శతకాన్ని చేజార్చుకున్నాడు.

>
మరిన్ని వార్తలు