‘ఆ ఇన్నింగ్స్‌’ ఆడాలనుంది!

19 May, 2020 02:25 IST|Sakshi

1998 సచిన్‌ షార్జా ‘ఇసుక తుఫాన్‌’ ఇన్నింగ్స్‌పై కోహ్లి

అండర్‌–19 తర్వాత సీరియస్‌గా ఆడాను

భారత ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రితో క్రికెట్‌ సారథి చాటింగ్‌

క్రికెటర్‌గా కెరీర్‌ను ఎంచుకోవడం, తనపై తండ్రి ప్రభావం, ఫిట్‌నెస్, పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోపై అభిమానం, సీనియర్లు సచిన్, వార్న్‌ల గురించి...ఇలా పలు అంశాలపై భారత ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రితో విరాట్‌ కోహ్లి తన మనసు విప్పి మాట్లాడాడు. విశేషాలు అతని మాటల్లోనే...

నాన్న చేసిన పని... 
నేను క్రికెట్‌ ఆడటం ప్రారంభించిన కొత్తలో ఒక జట్టులో చోటు దక్కలేదు. ప్రతిభకు లోటు లేదు కానీ లంచం ఇస్తేనే జట్టులోకి తీసుకుంటానని కోచ్‌ చెప్పాడు. మా అబ్బాయి సత్తా ఉంటే ఆడతాడు లేదంటే తప్పుకుంటాడు తప్ప నేను అలాంటి తప్పుడు పని చేయను అంటూ నాన్న కోచ్‌ ప్రతిపాదనను తిరస్కరించాడు. చోటు దక్కనందుకు ఆ రోజు చాలా బాధపడ్డాను కానీ తర్వాత వాస్తవం తెలిసింది. సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన నాన్న తర్వాత లాయర్‌గా మారారు. ఆయన నేర్పిన పాఠాలే నేను జీవితంలో ఎదిగేందుకు పనికొచ్చాయి. ఇప్పటికీ నాటి ఘటనను నేను సానుకూలంగానే చూస్తాను. నా 18 ఏళ్ల వయసులో ఆయన అకస్మాత్తుగా చనిపోయారు. బతికుంటే ఆయనను చాలా బాగా చూసుకునేవాడినని మాత్రం అనిపిస్తుంది. నేను పశ్చిమ ఢిల్లీలో పుట్టి పెరిగాను. ఎప్పుడూ మూలాలు మరచిపోను. అక్కడి మిత్రులు కలిస్తే అప్పుడు ఎలా మాట్లాడుకునేవాళ్లమో అదే భాషతో వారితో మాట్లాడతాను తప్ప గొప్పలు ప్రదర్శించను.

క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడంపై... 
నేను ఆటను మొదలు పెట్టినప్పుడు సీరియస్‌గా లేను. నాకు క్రికెట్‌ అంటే ఇష్టం కాబట్టి ఆడతానని మాత్రమే చెప్పాను. సన్నిహితులు కూడా నాకు కోచింగ్‌ ఇప్పిస్తే బాగుంటుందని నాన్నకు చెప్పారు. జూనియర్‌ స్థాయిలో టీమ్‌లకు ఆడుతూ వచ్చినప్పుడు కొంత ధైర్యం వచ్చింది. నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు అండర్‌–19 జట్టు సభ్యుడిగా తొలిసారి ఇంగ్లండ్‌ పర్యటించాను. అక్కడి ప్రదర్శన నాకు స్ఫూర్తినిచ్చింది. ఇకపై సమయం వృథా చేయదల్చుకోలేదు. ముందుకెళ్లాలని నిశ్చయించుకున్నాను. వైఫల్యాల గురించి భయపడలేదు.

ఫిట్‌నెస్‌ కీలకం...
నేను ఇప్పుడు ఇంత ఫిట్‌గా ఉన్నానంటే ఒకే ఒక్కడు కారణం. భారత జట్టుకు స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌గా పని చేసిన శంకర్‌ బసు నన్ను పూర్తిగా మార్చేశారు. ఇప్పుడు నాకు సంబంధించి అన్నింటికంటే ఫిట్‌నెస్సే కీలకం. నా కెరీర్‌ ఒక్కసారిగా మారిపోవడానికి ఇది కూడా కారణం. ఆయన నాకు కొత్త తరహా ఎక్సర్‌సైజ్‌లు నేర్పించారు. వెన్నునొప్పితో అలాంటివేమీ నేను చేయలేనని అనుకునేవాడిని. కానీ అన్నీ సాధ్యమయ్యాయి. జాతీయ జట్టు తరఫున ఆడినంత కాలం ఇంతే బలిష్టంగా ఉండాలి. అందుకోసం కష్టపడాలి. లేదంటే పక్కకు తప్పుకోవాలి.

రొనాల్డోను అభిమానించడంపై... 
మైదానంలో క్రిస్టియానో రొనాల్డో చూపించే దూకుడంటే నాకు చాలా ఇష్టం. ఒంటి చేత్తో అతను మ్యాచ్‌ ఫలితాన్ని మార్చగల తీరు అద్భుతం. చాంపియన్స్‌ లీగ్‌లో అతను యువెంటస్‌ తరఫున ఆడుతున్నప్పుడు ఆ జట్టు 0–2తో ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. అట్లెటికో మాడ్రిడ్‌తో జరిగిన తర్వాతి మ్యాచ్‌కు ముందు అతను తన కుటుంబ సభ్యులను అందరినీ మ్యాచ్‌కు రమ్మని చెప్పి మీరో అద్భుతం చూడబోతున్నారని ముందే చెప్పేశాడు. ఆ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి హ్యాట్రిక్‌తో జట్టును గెలిపించాడు. ఆ తరహా దూకుడు నాకు స్ఫూర్తినిస్తుంది.

సచిన్‌ ఇన్నింగ్స్‌... 
అంతర్జాతీయ క్రికెట్‌లో నేను కూడా అలాంటి ఇన్నింగ్స్‌ ఒకటి ఆడితే బాగుండేది అనిపించే మ్యాచ్‌ సచిన్‌ టెండూల్కర్‌ ‘ఇసుక తుఫాన్‌’. ఫైనల్‌కు అర్హత సాధించే క్రమంలో 1998లో షార్జాలో ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో అతని సెంచరీ అత్యద్భుతం. చివరి బంతికి షేన్‌ వార్న్‌ లేదా వకార్‌ యూనిస్‌లలో ఒకరిని ఎదుర్కోవాల్సి వస్తే... మ్యాచ్‌ ఆఖరి బంతిని మూడు పరుగులు చేస్తే గెలవాల్సిన స్థితి ఉంటే వీరిలో వకార్‌నే ఎంచుకుంటా.

యార్కర్లను బాగా ఆడటంలో నా సామర్థ్యంపై నాకు నమ్మకముంది. అలా అని వార్న్‌ అంటే భయమేమీ లేదు. అతను ఎప్పుడూ డెత్‌ ఓవర్లలో పెద్దగా బౌలింగ్‌ చేసింది లేదు. ఐపీఎల్‌లో అతడిని ఎదుర్కొన్నప్పుడు కూడా అనూహ్యమేమీ జరగలేదు. వార్న్‌ నన్ను అవుట్‌ చేయలేదు. నేను అతడి బౌలింగ్‌ను చితక్కొట్టలేదు కూడా. ఒకసారి మ్యాచ్‌ ముగిసిన తర్వాత నా వద్దకు బౌలర్‌కు ఎప్పుడూ మాటల్లో జవాబివ్వవద్దని అతను చెప్పాడు. కానీ నేనేమీ ఆ సూచనను పట్టించుకోలేదు.

మరిన్ని వార్తలు