తొలి టీ20: కోహ్లి నోట్‌బుక్‌ సెలబ్రేషన్‌!

7 Dec, 2019 14:56 IST|Sakshi

హైదరాబాద్‌: తన బ్యాట్‌తో పరుగుల వరద పారించే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. నిత్యం ఏదో రకమైన విషయాలతో వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఓ అరుదైన సంఘటనతో మరోసారి వార్తల్లోకెక్కాడు. విషయం ఏంటంటే.. శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాడు విలియమ్స్‌ను ఉద్దేశించి కోహ్లి తన చేతిని వర్చువల్ 'నోట్‌బుక్'గా మార్చి.. బుక్‌ తీసి టిక్‌ కొడుతున్నట్లు చేసిన విన్యాసం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో ఓ మ్యాచ్‌ సందర్భంగా తన వికెట్‌ తీసి సంబరాలు చేసుకున్నవిలియమ్స్‌కు అదే రీతిలో కౌంటర్ ఇచ్చాడంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు. ఇక 208 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు విజయానికి 30 బంతుల్లో 54 పరుగులు కావాల్సిన సమయంలో.. కోహ్లీ క్రీజులో ఉండటంతో మ్యాచ్ అప్పటికీ టీమిండియా చేతిలోనే ఉంది. విలియమ్స్‌ 16వ ఓవర్లో రెండో బంతిని అతని తలపై నుంచి కోహ్లి నేరుగా బౌండరీకి తరలించాడు. ఆ తర్వాతి బంతిని లాంగాన్‌లో కళ్లు చెదిరే సిక్సర్‌‌గా మలిచాడు.

చదవండి: కోహ్లిని కవ్వించొద్దని చెప్పానా..!

సిక్స‌ర్ కొట్టిన త‌ర్వాత కోహ్లి అదే నోట్‌బుక్‌ స్ట‌యిల్‌లో ఆ మూమెంట్‌ను ఎంజాయ్ చేశాడు. జేబులో నుంచి నోట్‌బుక్‌ను తీసి మూడు సార్లు టిక్కులు కొడుతున్నట్లు సెలబ్రేషన్ చేసుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం దీనిపై విరాట్‌ మాట్లాడుతూ.. గత వెస్టిండీస్‌ పర్యటనలో తనని ఔట్‌ చేసినపుడు విలియమ్స్‌ చేసిన సెలబ్రేషన్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఇలా బదులిచ్చినట్లు వ్యాఖ్యానించాడు. కాగా ఈ మ్యాచ్‌లో విరాట్‌కోహ్లి 50 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 94 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టీ20ల్లో కోహ్లీకి ఇది 23వ హాఫ్ సెంచరీ. తొలి టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో టీమిండియా మూడు టి20ల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. ఇక రెండో టి20 మ్యాచ్ డిసెంబరు 8న తిరువనంతపురంలో జరగనుంది.

మరిన్ని వార్తలు