కోహ్లి–పైన్‌  మరోసారి...

18 Dec, 2018 00:06 IST|Sakshi

 కెప్టెన్ల మధ్య మాటల యుద్ధం

మేం మంచివాళ్లుగా మారిపోయాం అంటూ ఆస్ట్రేలియన్లు ఎంతగా చెప్పుకున్నా, ఎక్కడో ఒక చోట ప్రత్యర్థిని కవ్వించేందుకు వారి ‘లోపలి మనిషి’ బయటకు వస్తూనే ఉంటాడు. పెర్త్‌ టెస్టులో కూడా ఇలాగే జరిగింది. భారత కెప్టెన్‌ కోహ్లి, ఆసీస్‌ కెప్టెన్‌ పైన్‌ మధ్య మాటల యుద్ధం ఆపేందుకు... చివరకు అంపైర్‌ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 71వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బుమ్రా బౌలింగ్‌లో మిడ్‌వికెట్‌ దిశగా ఆడిన పైన్‌ సింగిల్‌ పూర్తి చేసుకోబోతున్న సమయంలో లాంగాఫ్‌లో ఉన్న కోహ్లి క్రీజ్‌ వైపు నడిచాడు. వీరిద్దరు బాగా దగ్గరకు వచ్చి ఒకరినొకరు ఢీకొట్టుకున్నంత పని చేశారు! ఈ సమయంలో కోహ్లి ‘నేను నిన్నేమీ అనడం లేదు కదా. ఎందుకు ఆ అసహనం’ అని పైన్‌తో అన్నాడు.

దాంతో ‘నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎందుకు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నావు’ అంటూ పైన్‌ బదులిచ్చాడు! దాంతో అంపైర్‌ క్రిస్‌ గాఫ్‌నీ జోక్యం చేసుకొని మాట్లాడింది చాలు, మీరిద్దరు కెప్టెన్లు అంటూ సర్దిచెప్పాల్సి వచ్చింది. ‘నేనేమీ తిట్టడం లేదు, మాట్లాడటంలో తప్పేమీ లేదంటూ పైన్‌ చెప్పే ప్రయత్నం చేసినా అంపైర్‌ మళ్లీ అడ్డుకున్నారు. కోహ్లి ఔటైన తర్వాత కూడా క్రీజ్‌లో ఉన్న విజయ్‌తో ‘అతను నీ కెప్టెన్‌ అని నాకు తెలుసు. కానీ వ్యక్తిగా నువ్వు కూడా అతడిని ఇష్టపడవు’ అని పైన్‌ వ్యాఖ్యానించడం విశేషం! అయితే, ఆట ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు మొహమ్మద్‌ షమీ, హాజల్‌వుడ్‌ దీనిని తేలిగ్గా తీసుకున్నారు. ఐదు రోజుల పాటు సాగే మ్యాచ్‌లో ఇలాంటివి జరుగుతుంటాయని, వాటిని సరదాగా తీసుకోవాలని అన్నారు.  

మరిన్ని వార్తలు