‘అంతకు మించి కష్టపడాలి’

30 Aug, 2018 09:23 IST|Sakshi

సౌతాంప్టన్‌: సిరీస్‌ గెలవాలన్నా, ఓడిపోకుండా ఉండాలన్నా తప్పక గెలవాల్సిన పరిస్థితి టీమిండియాది. వరుసగా రెండు టెస్టులు ఓడిపోయిన అనంతరం మూడో టెస్టు గెలవడం కోహ్లి సేనలో ఆత్మవిశ్వాసం కలిగించే విషయమే.దీంతో రెట్టింపు ఉత్సాహంతో నాలుగో టెస్టుపై టీమిండియా కన్నేసింది. నాలుగో టెస్టు సన్న​ద్దతపై మ్యాచ్‌కు ముందు జరిగిన మీడియా సమావేశంలో కోహ్లి వివరించారు. 

గెలుస్తామనే నమ్మకం ఉంది
‘నాలుగో టెస్టు గెలవడానికి వ్యూహాలు రచించాం. వరుసగా రెండు టెస్టుల ఓటమి అనంతరం మూడో టెస్టు గెలవడానికి చాలా కష్టపడ్డాం. అయితే నాటింగ్‌హామ్‌లో కష్టపడినదానికంటే ఇంకాస్త ఎక్కువ కష్టపడితే సౌతాంప్టన్‌లోనూ గెలిచి సిరీస్‌ సమం చేస్తాం. నాకు పూర్తి నమ్మకం ఉంది. నాలుగో టెస్టులో గెలిచి తీరుతాం. గత మ్యాచ్‌ ఓటమితో ఆతిథ్య జట్టుపై కాస్త ఒత్తిడి ఉండటం సహజమే. వారు మరింత ఆటాకింగ్‌ గేమ్‌ ఆడే అవకాశం ఉంది. అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే ఇక్కడే సిరీస్‌ సమం చేస్తాం. మన పేస్‌ బౌలర్ల ప్రదర్శణ అద్భుతంగా ఉంది. ఈ పిచ్‌ పరిస్థితి చూస్తుంటే నాలుగో ఇన్నింగ్స్‌ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. మ్యాచ్‌కు ముందు మైదానాన్ని మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం.’ అంటూ కోహ్లి పేర్కొన్నారు. 

స్పిన్‌కు అనుకూలించే అవకాశం
నాటింగ్‌ హామ్‌ టెస్టు జట్టునే కొనసాగించే అవకాశం ఉంది. జస్ప్రిత్‌ బుమ్రా, ఇషాంత్‌ శర్మలు జట్టులో ఖాయంగా కనిపిస్తున్నారు. కోహ్లి అనుమానం మ్యాచ్‌ జరిగే కొద్ది పిచ్‌ స్పిన్నర్లుకు అనుకూలించే అవకాశం ఉండటంతో షమీ స్థానంలో రవీంద్ర జడేజా వచ్చే అవకాశం ఉంది. అశ్విన్‌ ఫిట్‌నెస్‌పై సందేహాలు అక్కర్లేదని కోహ్లి స్పష్టంచేశాడు. ఇక బ్యాటింగ్‌ విభాగంలో ఎలాంటి మార్పులు ఉండే అవకాశాలు లేవు. మూడో టెస్టులో ప్రతీ ఆటగాడు తన వంతు బాధ్యతను సమర్దవంతంగా నిర్వహించారు. ఇదే పద్దతి నాలుగో టెస్టులోనూ పాటిస్తే టీమిండియా గెలుపు ఖాయం. ఇక అనూహ్యంగా మూడో టెస్టు ఓడిపోయిన ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు రోజ్‌ బౌల్‌ మైదానంలో జరిగే మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు