వారెవ్వా కోహ్లి.. మూడేళ్లుగా అదే రోజున!

16 Jan, 2019 16:13 IST|Sakshi
విరాట్‌ కోహ్లి

కోహ్లికి అచ్చొచ్చిన జనవరి 15

అడిలైడ్‌ : ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో పరుగుల యంత్రం, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి శతకంతో అదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే  కాక‌తాళీయ‌మో లేక యాదృశ్చిక‌మో కానీ కోహ్లి  గత మూడేళ్లుగా ఒకే రోజున సెంచరీలు సాధించాడు. మంగళవారం (జనవరి 15) ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో కోహ్లి కెరీర్‌లో 39వ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఈ సెంచరీ ఆసీస్‌పై 6వది కాగా.. ఛేజింగ్‌లో 24వది కావడం విశేషం. జనవరి పదిహేను ఈ పరుగుల యంత్రానికి అచ్చొచ్చినట్టుంది. గత రెండేళ్లలో (2017, 2018) కూడా కోహ్లి ఇదే రోజున శతకాలు బాదాడు. 2017లో ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ సందర్భంగా తొలి వన్డేలో శతకం బాదిన కోహ్లి.. ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌తో అద్భుత భాగస్వామ్యం నమోదు చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి(122)తో పాటు జాదవ్‌(120) సెంచరీ సాధించడంతో భారత్‌ 351 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా11 బంతులు మిగిలిఉండగానే ఛేదించింది.

సరిగ్గా ఏడాది అనంతరం 2018లో మళ్లీ జనవరి 15నే కోహ్లి శతకం బాదాడు. ఈసారి వన్డేల్లో కాకుండా టెస్ట్‌ల్లో నమోదు చేశాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో మూడుటెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టెస్ట్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కోహ్లి(153) సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో మిగతా బ్యాట్స్‌మెన్‌ రాణించకపోవడం భారత్‌ పరాజయంపాలైంది. జోహన్నస్‌బర్గ్‌ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో సమిష్టి ప్రదర్శనతో చిరకాల విజయాన్ని నమోదు చేసింది. దీంతో కోహ్లిసేన 2-1తో సిరీస్‌ కోల్పోవాల్సి వచ్చింది. ఇక తాజాగా ఆస్ట్రేలియాపై కోహ్లి ఇదే జనవరి 15న సెంచరీ నమోదు చేయడంతో కోహ్లికి ఈ తేది  ప్రత్యేకంగా నిలిచిపోయింది.

మరిన్ని వార్తలు