కోహ్లి విన్నపాన్ని మన్నిస్తారా?

8 Nov, 2018 17:48 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి పగ్గాలు చేపట్టిన తర్వాత అతను బీసీసీఐ వ్యవహారాల్లో కూడా కీలకంగా మారిపోయాడు.   బీసీసీఐ పెద్దల ముందుకు కోహ్లి ఏ విషయాన్ని తీసుకొచ్చినా అతని నిర్ణయాన్ని గౌరవించడం పరిపాటిగా మారిపోయింది. ఇలా కోహ్లి చేసిన అభ్యర్థనల్లో క్రికెటర్ల కాంట్రాక్ట్‌ ఫీజు పెంచమని కోరడం ఒకటైతే, క్రికెటర్ల భార్యలను సైతం విదేశీ పర్యటనలకు పంపించాలనే అభ్యర్థన మరొకటి. ఈ రెండు ప్రధాన అభ్యర్థనల్లోనూ కోహ్లి దాదాపు సక్సెస్‌ అయ్యాడనే చెప్పాలి. అయితే తాజాగా మరొక విన్నపాన్ని బీసీసీఐ ముందు పెట్టాడు కోహ్లి. వచ్చే ఏడాది జరగబోయే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) నుంచి భారత ఫాస్ట్‌ బౌలర్లకు విశ్రాంతి కల్పించాలంటూ సుప్రీంకోర్టు నేతృత్వంలోనే ఏర్పాటైన క్రికెట్‌ పరిపాలన కమిటీ(సీఓఏ)కి విజ్ఞప్తి చేశాడు.

ప్రధానంగా స్టార్‌ పేసర్లకు విశ్రాంతినిస్తే బాగుంటుందని కోరాడు. వచ్చే వరల్డ్‌కప్‌కు ఐపీఎల్‌కు స్వల్ప గడువు మాత్రమే ఉండనున్న తరుణంలో ఈ ప్రతిపాదనను సీఓఏ దృష్టికి తీసుకొచ్చాడు. అదే సమయంలో బ్యాట్స్‌మెన్‌ మాత్రం రెండింటిలో పాల్గొన్నా ఎటువంటి ఇబ్బంది ఉండదని వివరించాడు. బౌలర్లకు గాయమైతే తేరుకోవడానికి సమయం పడుతుందని, దీనిలో భాగంగానే బూమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌ తరహా స్టార్‌ పేసర్లకు విశ్రాంతినిస్తే బాగుంటుందని కోహ్లి అభ్యర్థనలో కనబడుతోంది. మరి, కోహ్లి విన్నపం సమంజసంగా ఉన్నా, సీఓఏ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మే 30వ తేదీ నుంచి ఇంగ్లండ్‌లో వన్డే వరల్డ్‌కప్‌ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. కాగా, ఐపీఎల్‌-12వ సీజన్‌ ఏప్రిల్‌ మొదటి వారంలో ప్రారంభయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే మే నెల మూడో వారం వరకూ ఐపీఎల్‌ జరుగుతుంది. 

>
మరిన్ని వార్తలు