కోహ్లికి అరుదైన గౌరవం!

28 Mar, 2018 15:38 IST|Sakshi
విరాట్‌ కోహ్లి

న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తూ ప్రపంచ అత్యద్భుత బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందిన కోహ్లి మైనపు విగ్రహాన్ని ప్రతిష్టాత్మ ఢిల్లీ మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియంలో ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో ఈ గౌరవం పొందిన క్రీడా దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్‌, కపిల్‌ దేవ్‌, అర్జెంటీనా ఫుట్‌ బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీల సరసన కోహ్లి చేరాడు.

ఇప్పటికే లండన్‌ నుంచి వచ్చిన టుస్సాడ్‌ మ్యూజియం కళాకారులు కోహ్లి కొలతలు తీసుకున్నారు. ఇక టుస్సాడ్‌ మ్యూజియంలో తన విగ్రహం ఏర్పాటు చేయడంపై కోహ్లి ఆనందం వ్యక్తం చేశాడు. ‘మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియంలో నా విగ్రహం ఏర్పాటు చేయడం అత్యంత గౌరవంగా భావిస్తున్నా. ఓపికతో నా  కొలతలు తీసుకొని నాకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని ఇస్తున్న టుస్సాడ్‌ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలని’  కోహ్లి పేర్కొన్నాడు.

2006 దేశవాళి క్రికెట్‌లో అడుగుపెట్టిన కోహ్లి 2008 అండర్‌-19 వరల్డ్‌కప్‌ అందించి సీనియర్‌ జట్టులోకి వచ్చాడు.  అనతి కాలంలోనే ప్రపంచ రికార్డులన్ని తిరగ రాస్తూ ప్రపంచ బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు సాధించాడు. ఇప్పటికే అర్జున అవార్డ్‌, ఐసీసీ వరల్డ్‌ క్రికెటర్‌, మూడు సార్లు బీసీసీఐ ఇంటర్నేషనల్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులందుకున్న కోహ్లికి భారత ప్రభుత్వం నుంచి గౌరవ పద్మశ్రీ పురుస్కారం కూడా లభించింది.

ఇక ప్రతిష్టాత్మక లండన్‌ మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియం వివిధ దేశాల్లో 21 బ్రాంచిలు ఏర్పాటు చేసింది. దీని బ్రాంచి ఢిల్లీలో కూడా ఉంది. మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియంలో ప్రముఖ, హాలీవుడ్‌, బాలీవుడ్‌ నటులు, ప్రఖ్యాత ఆటగాళ్లు, రాజకీయ వేత్తల మైనపు విగ్రహాలను ఏర్పాటు చేస్తారన్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు