కోహ్లీ నేతృత్వంలో టీమిండియా సరికొత్త డిమాండ్‌

28 Nov, 2017 17:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తమ జీతాలు పెంచాలన్న సరికొత్త డిమాండ్‌ను టీమిండియా ఆటగాళ్లు తెరపైకి తీసుకొచ్చారు. భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌ అయిన విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోనే జట్టు ఆటగాళ్లు తమ కాంట్రాక్టు నగదును సవరించాలని కోరేందుకు సిద్ధంగా ఉన్నారట. కోహ్లీ, ధోనీ, రవిశాస్త్రిలు కలిసి బీసీసీఐ అధికారి వినోద్‌ రాయ్‌తో ఈ శుక్రవారం భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని బోర్డుకు చెందిన ఓ సీనియర్‌ ఉద్యోగి వెల్లడించాడు.

గత కొంత కాలం నుంచి టీమిండియా తీరికలేని షెడ్యూళ్లతో సిరీస్‌లు ఆడుతోంది. ఈ నేపథ్యంలో విశ్రాంతి కావాలని, తాను రోబోను కాదంటూ  కోహ్లీ బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేయగా, మాజీ కెప్టెన్లు ఎంఎస్‌ ధోనీ, సౌరవ​ గంగూలీ, ప్రధాన కోచ్‌ రవిశాస్త్రిలు మద్ధతు తెలిపారు. ఈ క్రమంలో లంకతో వన్డే సిరీస్‌ నుంచి కోహ్లీకి విశ్రాంతి నిచ్చారు. అయితే తాజాగా బోర్డు తమ వేతనాలను సవరించాలని టీమిండియా అన్ని ఫార్మాట్ల ఆటగాళ్లు ఆశించడం తెరపైకి వచ్చింది.

గత సెప్టెంబర్‌ 30తో ఆటగాళ్ల కాంట్రాక్ట్‌ గడువు ముగిసింది. స్టార్‌ ఇండియా చానెల్‌ 2018 నుంచి 2022 వరకు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్స్‌ (ఐపీఎల్‌) ప్రసార హక్కులను బీసీసీఐకి భారీగా చెల్లించి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తమ వేతన కాంట్రాక్టు ముగియడంతో కొత్త వేతన కాంట్రాక్ట్‌లో తమ జీతభత్యాలు మరింత పెంచాలని ఆటగాళ్లు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ధోనీ, రవిశాస్త్రిలతో చర్చించిన అనంతరం ముగ్గురు కలిసి కాంట్రాక్ట్‌ వేతనాల పెంపుకోసం వినోద్‌ రాయ్‌తో భేటీ అవనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఏడాది క్రికెటర్ల వేతనాలను బీసీసీఐ భారీ పెంచగా.. ఏ గ్రేడ్‌ (టాప్‌ ప్లేయర్స్‌) క్రికెటర్లు రూ. 1.93 కోట్ల వార్షిక ఆదాయాన్ని అందుకుంటున్నారు.

మరిన్ని వార్తలు