సచిన్‌ రికార్డుల్ని కోహ్లి సవరిస్తాడు: బ్రెట్‌ లీ 

26 Apr, 2020 01:34 IST|Sakshi

ముంబై: భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రికార్డులను టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరి కొన్నేళ్లలో అందుకుంటాడని ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ బ్రెట్‌లీ అభిప్రాయపడ్డాడు. సచిన్‌ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డును కోహ్లి మరో ఏడెనిమిదేళ్లలో సవరిస్తాడని పేర్కొన్నాడు. తన నైపుణ్యం, ఫిట్‌నెస్, మానసిక బలంతో కోహ్లి ఏ రికార్డులైనా అందుకుంటాడని బ్రెట్‌ లీ అన్నాడు. ‘బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నైపుణ్యం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఇక ఫిట్‌నెస్‌లో అతనికి తిరుగు లేదు. ఇక మానసిక బలంతో కఠిన మ్యాచ్‌ల్లోనూ రాణిస్తున్నాడు. అందుకే మరో ఏడెనిమిదేళ్లలో సచిన్‌ పేరిట ఉన్న రికార్డులను కోహ్లి బద్దలు కొడతాడు’ అని లీ పేర్కొన్నాడు. వన్డేల్లో సచిన్‌ 49 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా... ప్రస్తుతం విరాట్‌ 248 మ్యాచ్‌ల్లో 43 శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో ‘మాస్టర్‌’ 51 సెంచరీలు చేయగా... కోహ్లి 86 మ్యాచ్‌ల్లో 27 సెంచరీలు బాదాడు. సచిన్‌ ఓవరాల్‌ సెంచరీల రికార్డుకు కోహ్లి ఇంకా 30 సెంచరీల దూరంలో ఉన్నాడు.

మరిన్ని వార్తలు