ఆసియా జట్టులో కోహ్లి 

26 Feb, 2020 03:55 IST|Sakshi

వరల్డ్‌ ఎలెవన్‌తో రెండు టి20 మ్యాచ్‌ల పోరు

ఢాకా: బంగ్లాదేశ్‌ జాతిపిత షేక్‌ ముజీబుర్‌ రహమాన్‌ శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న రెండు మ్యాచ్‌ల ప్రత్యేక టి20 సిరీస్‌లో భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పాల్గొనే అవకాశం ఉంది. ఆసియా ఎలెవన్, వరల్డ్‌ ఎలెవన్‌ మధ్య మార్చి 21, 22 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. కోహ్లి దీనిని అధికారికంగా ధ్రువీకరించకపోయినా అతను కనీసం ఒక మ్యాచ్‌లోనైనా ఆడతాడని సమాచారం. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీతో చర్చించిన తర్వాత దీనిపై కోహ్లి స్పష్టతనిస్తాడు. భారత జట్టు సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో మార్చి 18న చివరి వన్డే ఆడనుండగా... మార్చి 29న ఐపీఎల్‌ ప్రారంభమవుతుంది. తన బిజీ షెడ్యూల్‌ నుంచి కోహ్లి ఈ మ్యాచ్‌ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సి ఉంది. కోహ్లి ఒక మ్యాచ్‌ ఆడితే మరో మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ బరిలోకి దిగనున్నట్లు తెలిసింది.

మరో నలుగురు భారత క్రికెటర్ల పేర్లు మాత్రం ఖరారయ్యాయని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) వెల్లడించింది. శిఖర్‌ ధావన్, రిషభ్‌ పంత్, మొహమ్మద్‌ షమీ, కుల్దీప్‌ యాదవ్‌ ఈ సిరీస్‌లో ఆడనున్నారు. భారత్, బంగ్లాదేశ్‌లతో పాటు శ్రీలంక, అఫ్గానిస్తాన్‌కు చెందిన ఆటగాళ్లు కూడా ఆసియా ఎలెవన్‌ టీమ్‌లో ఉంటారు. అదే సమయంలో పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) జరుగుతున్నందున ఆ దేశపు ఆటగాళ్లను ఆహ్వానించడం లేదు. వరల్డ్‌ ఎలెవన్‌ జట్టు తరఫున డు ప్లెసిస్, గేల్, బెయిర్‌స్టో, పొలార్డ్‌ తదితరులు ఈ రెండు మ్యాచ్‌లలో పాల్గొనే అవకాశం ఉంది. జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ఆసియా ఎలెవన్‌: కోహ్లి, రాహుల్, ధావన్, పంత్, కుల్దీప్, షమీ(భారత్‌), తిసారా పెరీరా, మలింగ (శ్రీలంక), ముజీబుర్‌ రహమాన్, రషీద్‌ ఖాన్‌ (అఫ్గానిస్తాన్‌), సందీప్‌ లమిచానె (నేపాల్‌), ముస్తఫిజుర్‌ , తమీమ్‌ ఇక్బాల్, ముష్ఫికర్‌ రహీమ్, లిటన్‌ దాస్, మహ్ముదుల్లా (బంగ్లాదేశ్‌).

వరల్డ్‌ ఎలెవన్‌: అలెక్స్‌ హేల్స్, బెయిర్‌స్టో (ఇంగ్లండ్‌), క్రిస్‌ గేల్, నికోలస్‌ పూరన్, కీరన్‌ పొలార్డ్, షెల్డన్‌ కాట్రెల్‌ (వెస్టిండీస్‌), డు ప్లెసిస్, ఇన్‌గిడి (దక్షిణాఫ్రికా), ఆండ్రూ టై (ఆస్ట్రేలియా), మిచెల్‌ మెక్లీనగన్‌ (న్యూజిలాండ్‌).

మరిన్ని వార్తలు