కోహ్లీ ఖాతాలో ‘సియెట్‌ ఇంటర్నేషనల్‌ క్రికెటర్‌’

15 May, 2019 09:14 IST|Sakshi

మహిళల విభాగంలో స్మృతి మంధానకు..

మొహిందర్‌ అమర్‌నాథ్‌కు లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌

హైదరాబాద్‌: సియెట్‌ అవార్డుల్లో భారత క్రికెటర్లు సత్తా చాటారు. పురుషుల విభాగంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, మహిళల విభాగంలో డాషింగ్‌ బ్యాట్స్‌ఉమెన్‌ స్మృతి మంధాన ‘ఇంటర్నేషనల్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు దక్కించుకున్నారు. కోహ్లీకి బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ కేటగిరీలోనూ అవార్డు సొంతం చేసుకున్నాడు. టీమిండియా స్టార్‌ బౌలర్, డెత్‌ ఓవర్ల స్పెషలిస్టు జస్‌ప్రీత్‌ బుమ్రాను బెస్ట్‌ బౌలర్‌ అవార్డు వరించింది. ఇంటర్నేషనల్‌ టెస్ట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ఇయర్‌ అవార్డు ఛెతేశ్వర్‌ పుజారాకు దక్కింది.

అంతర్జాతీయ వన్డే క్రికెట్‌ పురస్కారం రోహిత్‌ శర్మ వశమైంది. టీ20 ప్లేయర్‌ అవార్డు ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఆరోన్‌ ఫించ్‌కు దక్కింది. అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రికెటర్‌ అవార్డు కుల్దీప్‌ యాదవ్‌ను వరించింది. ఇంటర్నేషనల్‌ టీ20 బౌలర్‌ అవార్డు ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన రషీద్‌ ఖాన్‌కు దక్కగా, భారత మాజీ కెప్టెన్‌ మొహిందర్‌ అమర్‌నాథ్‌కు లైఫ్‌ టైమ్‌ అచీవమెంట్‌ పురస్కారం లభించింది. అవార్డుల ప్రదానోత్సవాన్ని సోమవారం ముంబైలో ఘనంగా నిర్వహించారు. టీమిండియా మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్, మాజీ ఆటగాడు గౌతం గంభీర్, రోహిత్‌ శర్మ, రహానే, బుమ్రా కార్యక్రమానికి హాజరయ్యారు.

మరిన్ని వార్తలు