తొలి వికెట్‌ కోహ్లిదైతే ఆ కిక్కే వేరబ్బా..

3 Oct, 2019 13:29 IST|Sakshi

విశాఖ: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భాగంగా మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నిరాశపరిచాడు. 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి పెవిలియన్‌ చేరాడు. దాంతో భారత జట్టు 377 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ సెనురాన్‌ ముత్తుసామీ బౌలింగ్‌లో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఇది ముత్తుస్వామి అరంగేట్రం టెస్టు మ్యాచ్‌. ఇక కోహ్లి వికెట్‌ సాధిస్తే ఆ కిక్కే వేరబ్బా అనేంతంగా ఎగిరి గంతులేశాడు ముత్తుసామీ. ఇలా కోహ్లిని టెస్టు ఫార్మాట్‌లో తమ తొలి వికెట్‌గా తీసిన వారిలో కగిసో రబడా(దక్షిణాఫ్రికా), అల్జెరీ జోసెఫ్‌(వెస్టిండీస్‌)లు ఉన్నారు. ఇప్పుడు వారి సరసన ముత్తుసామి చేరిపోయాడు.

అంతకుముందు చతేశ్వర్‌ పుజారా(6) విఫలం కాగా,  రోహిత్‌ శర్మ(176; 244 బంతుల్లో 23 ఫోర్లు, 6 సిక‍్సర్లు) భారీ సెంచరీ చేసి పెవిలియన్‌ చేరాడు. 202/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన భారత్‌ 317 పరుగుల వద్ద రోహిత్‌ వికెట్‌ను కోల్పోయింది. ఈ రోజు ఆటలో మరో 115 పరుగులు జత చేసిన తర్వాత రోహిత్‌ శర్మ ఔటయ్యాడు. ఓపెనర్‌గా ఇన్నింగ్స్‌ ఆరంభించిన తొలి టెస్టులోనే రోహిత్‌ డబుల్‌ సెంచరీ సాధిస్తాడనుకున్నప్పటికీ ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మహరాజ్‌ వేసిన 82 ఓవర్‌ ఆఖరి బంతిని ముందుకొచ్చి ఆడబోయిన రోహిత్‌ స్టంపింగ్‌ అయ్యాడు. దాంతో భారత్‌ తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. కాగా, మయాంక్‌  అగర్వాల్‌ 150 పరుగుల మార్కును చేరాడు.

>
మరిన్ని వార్తలు