విరాట్ సేనపై అండర్సన్ సంచలన వ్యాఖ్యలు

12 Dec, 2016 14:22 IST|Sakshi
విరాట్ సేనపై అండర్సన్ సంచలన వ్యాఖ్యలు

ముంబై:ఐదు టెస్టుల సిరీస్ను ఇంకా మ్యాచ్ ఉండగానే భారత్ క్రికెట్ జట్టు గెలుచుకోవడంపై ఇంగ్లండ్ ప్రధాన పేసర్ అండర్సన్ తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. భారత్ గెలుపు సాధించడానికి స్లో పిచ్లే కారణమంటూ ధ్వజమెత్తాడు. అసలు ఎటువంటి పేస్కు అనుకూలించని పిచ్లను తయారు చేయడంతోనే  తాము ఘోరంగా ఓటమి పాలైనట్లు అండర్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత్ పిచ్ల్లో సాంకేతికంగా పాటించాల్సిన కొన్ని పద్ధతుల్ని పాటించలేదని విమర్శించాడు. అది విరాట్ కోహ్లి గేమ్ ప్లాన్లో భాగంగానే జరిగిందంటూ వ్యాఖ్యానించాడు.


'2014లో ఇంగ్లండ్ పర్యటనకు వచ్చిన కోహ్లి బ్యాటింగ్ చేయడంలో చాలా ఇబ్బంది పడ్డాడు. అప్పటికీ, ఇప్పటికీ కోహ్లి బ్యాటింగ్లో మార్పు వచ్చిందనేది నేను కచ్చితంగా చెప్పలేను. కాకపోతే స్పిన్ను బాగా ఆడగలిగే కోహ్లి, ఈ సిరీస్లోని స్లో పిచ్లపై అదే చేశాడని భావిస్తున్నా. మా సిరీస్ ఓటమికి పూర్తిగా స్పిన్ అనుకూలించే పిచ్లే కారణం. ఇంగ్లండ్లో అప్పడు విరాట్ ను ఏ రకంగా పేస్ బౌలింగ్ తో ఇబ్బంది పెట్టేమో, అది ఇక్కడ పిచ్ల్లో కనిపించలేదు. మా ఇరు జట్ల మధ్యకు తేడా అదే. ఈ రకంగా చూస్తే విరాట్ కోహ్లి సాంకేతికంగా మరింత పరిణితి చెందాడని అనుకోవడం లేదు' అని అండర్సన్ విమర్శించాడు.

తమ వద్ద ప్రతీ ఒక్క ఆటగాడికి ప్రణాళికలు ఉన్నా వాటిని అమలు చేయలేకపోయామన్నాడు. ఇక్కడ జయంత్ యాదవ్ను ప్రత్యేకంగా అండర్సన్ ప్రస్తావించాడు. జయంత్ యాదవ్ పోటీదారుడని తమకు తెలుసని, అందులో భాగంగానే అతనికి కూడా ప్రణాళికలు సిద్ధం చేశామన్నాడు. అయితే కొన్ని సందర్భాల్లో అవి విఫలం అవుతుంటాయన్నాడు. మూడో టెస్టు మ్యాచ్ ఆడుతున్న జయంత్ యాదవ్ సెంచరీ తనను ఏమీ ఆశ్చర్యపరచలేదని ఇంగ్లండ్ ఆల్ టైమ్ గ్రేట్ బౌలర్ అండర్సన్ తెలిపాడు.

మరిన్ని వార్తలు