సెహ్వాగ్ పరువు తీసిన 'లంబూ'!

16 May, 2017 07:34 IST|Sakshi
సెహ్వాగ్ పరువు తీసిన 'లంబూ'!

మొహాలీ: గతంలో టీమిండియా పేస్ దళాన్ని నడిపించిన బౌలర్ ఇషాంత్ శర్మను జట్టులోకి తీసుకుని మేనేజ్‌మెంట్ తప్పిదం చేసింది. ఎందుకంటే ఏ జట్టు అతడిపై నమ్మకం ఉంచలేదు. వేలంలో ఎవరూ కొనుగోలు చేయని సమయంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అతడిని తీసుకుంది. పంజాబ్ టీమ్ మెంటర్, డైరెక్టర్ గా ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒత్తిడి తేవడంతోనే ఇషాంత్‌కు చాన్స్ వచ్చింది. లేనిపక్షంలో ఐపీఎల్-10 సీజన్లో ఇషాంత్ (టీమిండియా క్రికెటర్లు పిలిచేపేరు 'లంబూ')ను చూసేవాళ్లం కాదు. సందీప్ శర్మ, మోహిత్ శర్మ లాంటి నాణ్యమైన బౌలర్లు ఉన్నప్పటికీ పంజాబ్‌ పేస్‌ ను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఇషాంత్‌ శర్మను సెహ్వాగ్ జట్టులోకి తీసుకున్నాడు.

ఇషాంత్‌ను ఎవరైనా కొంటారా అంటూ చిరకాల మిత్రుడు గంభీర్ కామెంట్ చేయగా.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇషాంత్‌ను వెనకేసుకొచ్చాడు. అయితే సీజన్లో చెత్త ప్రదర్శన చేసిన బౌలర్లలో ఇషాంత్ ముందు వరసలో ఉంటాడు. సెహ్వాగ్ తనపై ఉంచిన నమ్మకాన్ని దారుణంగా దెబ్బతీశాడు. ఒక్క మ్యాచ్‌లోనూ రాణించకపోగా.. వరుస మ్యాచ్‌ల్లో విఫలమవుతూ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్‌లో అత్యధిక బంతులు (108) వేసి ఒక్క వికెట్‌ తీయలేని బౌలర్‌గా అపవాదు మూటకట్టుకున్నాడు. తానాడిన 6 మ్యాచ్‌లలో  18 ఓవర్లు వేసిన ఇషాంత్ ఒక్క వికెట్‌ పడగొట్టలేదు. కనీసం ఒక రనౌట్‌లోనైనా భాగస్వామి కాలేదు, కనీసం ఒక్క క్యాచైనా పట్టి ఒక బ్యాట్స్‌మెన్ ఔట్ కావడంలోనూ అతడు పాలుపంచుకోలేదు. ప్రస్తుత సీజన్లో తమ చివరి మ్యాచ్‌లో పుణే చేతిలో దారుణ ఓటమితో ఆ జట్టు కథ ముగిసిన విషయం తెలిసిందే. పంజాబ్ కథ ముగిశాక ఇషాంత్ బౌలింగ్‌పై సోషల్ మీడియాతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు