ఆ జవాన్ల పిల్లలను నేను చదివిస్తా: సెహ్వాగ్‌ 

17 Feb, 2019 01:03 IST|Sakshi

న్యూఢిల్లీ: పుల్వామాలో ఉగ్రదాడిలో అసువులు బాసిన సీఆర్‌పీఎఫ్‌ సైనికుల పిల్లలకు విద్యనందించేందుకు భారత క్రికెట్‌ జట్టు మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ముందు కొచ్చాడు. ‘అమర జవాన్లకు మనం ఏం చేసినా తక్కువే! నేను వారి పిల్లలను చదివించే పూర్తి బాధ్యతను తీసుకుంటా. నా ‘సెహ్వాగ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌’లో వారికి విద్యను అందజేస్తాను’అని ట్విట్టర్‌లో వీరూ పోస్ట్‌ చేశాడు. హరియాణా పోలీస్‌ శాఖలో ఉన్నత ఉద్యోగి అయిన స్టార్‌ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ తన ఒక నెల జీతాన్ని అమరుల కుటుంబాలకు అందజేస్తున్నట్లు ప్రకటించాడు.

ప్రతీ ఒక్కరు ఈ హేయమైన చర్యను ఖండించడంతో పాటు ఉదారతను చాటుకొని సాధ్యమైనంత సాయం అందజేయాలని సూచించాడు. ఉగ్రమూకల దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతిచెందగా... తీవ్రంగా గాయాలపాలైన పలువురు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. మరోవైపు ముంబైలోని క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) నిర్వాహకులు తమ క్లబ్‌ ఆవరణలో ఉన్న పాకిస్తాన్‌ ప్రధానమంత్రి, మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ చిత్రపటాన్ని వస్త్రంతో కప్పి వేసి నిరసన వ్యక్తం చేశారు.   
 

మరిన్ని వార్తలు