బర్త్‌డే రోజే వీరూ గుడ్‌బై

20 Oct, 2015 16:52 IST|Sakshi
బర్త్‌డే రోజే వీరూ గుడ్‌బై

న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనదైన ముద్రవేసి విధ్వంసకర బ్యాట్సమెన్ లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇప్పటికే దుబాయ్‌లో మాస్టర్స్ లీగ్ కు సంబంధించిన మీడియా సమావేశంలో రిటైర్ కానున్నట్లు చూచాయగా వెల్లడించిన వీరేంద్ర సెహ్వాగ్..  మంగళవారం తాను అంతర్జాతీయ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లతో పాటు, ఐపీఎల్ నుంచి కూడా వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.  ఈరోజు తన 37వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్న సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్నట్లు తెలిపాడు.

దాదాపు రెండున్నరేళ్ల క్రితం 2013 మార్చిలో తన ఆఖరి టెస్టు ఆడిన సెహ్వాగ్, అదే ఏడాది జనవరిలో చివరిసారిగా వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టు క్రికెట్‌లో రెండు ‘ట్రిపుల్ సెంచరీలు’ చేసిన ఏకైక భారత ఆటగాడైన సెహ్వాగ్, వన్డేల్లో ‘డబుల్ సెంచరీ’ సాధించిన ఐదుగురు ఆటగాళ్లలో ఒకడు. 2007లో టి20, 2011లో వన్డే ప్రపంచకప్ గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడైన సెహ్వాగ్ టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో భారత్ చిరస్మరణీయ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. తాజాగా మాస్టర్ చాంపియన్స్ లీగ్ -2020పై సంతకం చేసిన సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోలేక తప్పలేదు. ఆ లీగ్ లో కేవలం క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లు మాత్రమే పాల్లొనాలి.

 

104 టెస్టులు ఆడిన సెహ్వాగ్ 49.34 సగటుతో 23 సెంచరీలతో 8,586 పరుగులు చేశాడు. కాగా, 251 వన్డేలు ఆడి 35.05 సగటుతో 15 సెంచరీలతో 8,273 పరుగులను నమోదు చేశాడు. ఇక ట్వంటీ 20 ల్లో 19 మ్యాచ్ లు ఆడి 21.88 సగటుతో  394 పరుగులు చేశాడు. టెస్టుల్లో అతని అత్యధిక స్కోరు 319. కాగా, వన్డేల్లో అత్యధిక స్కోరు 219.

 

1999లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో వన్డే ఆరంగేట్రం చేసిన వీరు.. ఆపై రెండేళ్లకు అంటే 2001 నవంబర్ లో దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో చోటు సంపాదించాడు. తొలుత టెస్టుల్లో సరిపోతాడా?అనే అనుమానాలు వచ్చినా.. అది నిజం కాదని నిరూపించాడు. భారత్ టెస్టుల్లోకి వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఏ బ్యాట్స్‌మన్‌కూ అందని ‘ట్రిపుల్ సెంచరీ’ అతను పాకిస్తాన్ గడ్డపై సాధించిన రోజున గర్వించని భారతీయుడు లేడు. మరో నాలుగేళ్లకు మరో ‘ట్రిపుల్’ను బాది ఎవరికీ అందని ఎత్తులో నిలిచిన అతను వన్డేల్లోనూ ‘డబుల్’తో తన విలువను చూపించాడు. 
 

క్రికెట్ దిగ్గజాల ప్రశంసల్లో కొన్ని!

*సెహ్వాగ్ బ్యాటింగ్ శైలి అచ్చు తన బ్యాటింగ్ లాగానే ఉంటుందని వెస్టిండీస్ లెజెండ్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ ప్రశంసించడం నిజంగా వీరు గొప్పతనంగా చెప్పవచ్చు. వీరు క్రీజ్ లో బ్యాట్ పట్టుకుని ఉన్నాడంటే బంతిని బలంగా విరుచుకుపడే విధానం తన ఆట శైలిని గుర్తు చేస్తుందంటూ  రిచర్డ్స్ కొనియాడాడు.

*2011, డిసెంబర్ 8 వ తేదీన వెస్డిండీస్ తో ఇండోర్ లో జరిగిన నాల్గో వన్డేలో సెహ్వాగ్(219; 149 బంతుల్లో 25 ఫోర్లు, 7 సిక్స్ లు)  డబుల్ సెంచరీని నమోదు చేశాడు. ఈ సందర్భంగా ఇంగ్లండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఒక ఆసక్తిర కామెంట్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. మీరు గనుక క్రికెట్ అభిమాని అయితే విండీస్ పై విధ్వంసం సృష్టిస్తున్న సెహ్వాగ్ ఆటతీరును చూడండి. మీరు తక్షణమే వెళ్లి  టీవీలు ఆన్ చేయండి అంటూ అభిమానులను ఉద్దేశిస్తూ చేసిన పీటర్సన్ కామెంట్ చేశాడు.

*మరొక భారతీయుడు తన రికార్డును అధిగమించడం చాలా సంతోషంగా ఉందంటూ సెహ్వాగ్ డబుల్ సెంచరీ అనంతరం క్రికెట్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు.

 

*వన్డే క్రికెట్ లో సచిన్ డబుల్ సెంచరీ చేసిన తరువాత సెహ్వాగ్ నుంచి కూడా మరొక  డబుల్ వస్తుందని తాను ముందుగానే నమ్మినట్లు మహేంద్ర సింగ్ ధోని తెలిపాడు.

 

*ఒక భారతీయుడే తన రికార్డును అధిగమించడం చాలా సంతోషంగా ఉందంటూ సెహ్వాగ్ డబుల్ సెంచరీ అనంతరం క్రికెట్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు.

*తాను ఎప్పుడు సర్ వివియన్ రిచర్గ్స్ బ్యాటింగ్ చూడలేదు. కానీ సెహ్వాగ్ విధ్వంసాన్ని చూశాను. వన్డేల్లో 219 పరుగులు చేయడం మామూలు విషయం కాదు. దీన్ని అధిగమించడం ఎవరీ సాధ్యం కాదు అంటూ సెహ్వాగ్ బ్యాటింగ్ ను ఉద్దేశిస్తూ క్రిస్ గేల్ చేసిన కామెంట్.


వీరేంద్ర సెహ్వాగ్ అనగానే అభిమానుల మనసుల్లో ముద్రించుకుపోయిన కొన్ని ఇన్నింగ్స్‌లను చూస్తే....
 
టెస్టులు
* 2003 (మెల్‌బోర్న్): ఆస్ట్రేలియాపై ‘బాక్సింగ్ డే’ టెస్టులో ఐదు గంటల్లోనే 195 పరుగుల ఇన్నింగ్స్.
* 2004 (ముల్తాన్): భారత్ తరఫున తొలి ‘ట్రిపుల్ సెంచరీ’ (319). సక్లాయిన్ బౌలింగ్‌లో సిక్స్‌తో ఈ ఘనత.
* 2008 (అడిలైడ్): ఆస్ట్రేలియాపై రెండో ఇన్నింగ్స్‌లో 151 పరుగులతో భారత్‌కు తప్పిన ఓటమి.
* 2008 (చెన్నై): 278 బంతుల్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ రికార్డు (దక్షిణాఫ్రికాపై).
* 2009 (ముంబై): మూడో ‘ట్రిపుల్ సెంచరీ’ మిస్. శ్రీలంకపై 254 బంతుల్లో 293.
* 2010 (కోల్‌కతా): 174 బంతుల్లో 165. టెస్టుల్లో నంబర్‌వన్‌గా సెహ్వాగ్.
 
వన్డేలు
* 2001 (కొలంబో): సచిన్ గైర్హాజరులో వన్డేల్లో ఓపెనింగ్ చేసే అవకాశం వచ్చింది. 69 బంతుల్లో సెంచరీ...సెహ్వాగ్ స్టయిల్ బయటపడింది.
* 2002 (కొలంబో): చాంపియన్స్ ట్రోఫీ సెమీస్. ఇంగ్లండ్‌పై 77 బంతుల్లో సెంచరీతో భారత్ ఫైనల్‌కు.   
* 2009 (హామిల్టన్): 60 బంతుల్లో సెంచరీతో భారత్ తరఫన కొత్త రికార్డు.  
* 2009 (రాజ్‌కోట్): 102 బంతుల్లో 146 పరుగులతో 414 పరుగుల జట్టు రికార్డు స్కోరులో కీలకపాత్ర.  
* 2011 (ఇండోర్): 140 బంతుల్లో వన్డేల్లో డబుల్ సెంచరీ..
 

>
మరిన్ని వార్తలు