సెహ్వాగ్‌కు ‘రామాయణం’ గుర్తొచ్చింది..!

13 Apr, 2020 13:48 IST|Sakshi

నా బ్యాటింగ్‌ స్టైల్‌కు ప్రేరణ అంగధ్‌జీ..

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టులో విధ్వంసకర ఓపెనర్‌గా పేరుగాంచిన వీరేంద్ర సెహ్వాగ్‌ బ్యాటింగ్‌ శైలి మాత్రం విన్నూత్నంగా ఉంటుంది. సాధారణంగా క్రికెట్‌ ఆడే వాళ్లలో ప్రతీ ఒక్కరూ తమ ఫుట్‌వర్క్‌ను ఎంతోకొంత కదుపుతూ షాట్‌లను డిసైడ్‌ చేసుకుంటారు. మరి మనోడి బ్యాటింగ్‌ స్టైల్‌ మాత్రం అందుకు పూర్తి భిన్నం. నిల్చున్న చోట నుంచే ఒక్క అంగుళం కూడా కదలకుండా భారీ షాట్లు ఆడేయగలడు. తన ఆటతో క్రికెట్‌కే వన్నె తెచ్చిన సెహ్వాగ్‌.. ఫుట్‌వర్క్‌పై ఇప్పటికీ చాలామందికే అనుమానాలున్నాయి. అసలు లెగ్‌ మూమెంటే లేకుండా ఎలా విరుచుకుపడతాడనే సందేహం చాలామందిలో ఉంది.  అప్పట్లో సెహ్వాగ్‌ ఫుట్‌వర్క్‌పై చాలామంది విమర్శలు చేసినా ‘నేనింతే’ అన్నట్లు ఉండిపోయాడు. అందుకు  బ్యాట్‌తోనే సమాధానం చెబుతూ ఉండటంతో విమర్శకులు కూడా ఏమీ మాట్లాడలేకపోయేవారు.

తాజాగా తన ఫుట్‌వర్క్‌పై సమాధానమిచ్చాడు సెహ్వాగ్‌. మరి తన ఫుట్‌వర్క్‌ గురించి చెప్పాలనుకున్నాడో లేక బ్యాటింగ్‌ చేయడానికి ఫుట్‌వర్క్‌ అనేది అవసరం లేదన్నకున్నాడో ఏమో కానీ హిందూ పురాణాల్లో ఒకటైన రామయాణాన్ని గుర్తుచేసుకున్నాడు సెహ్వాగ్‌. ఆ రామాయణ పురాణంలోని వానర సైన్యంలో ఒకరైన అంగధుడ్ని ప్రేరణగా తీసుకున్నాడు ప్రత్యేకంగా తన ఫుట్‌వర్క్‌ని అంగధుడితో పోల్చుకున్నాడు సెహ్వాగ్‌.  లాక్‌డౌన్‌ కారణంగా  టీవీలో ప్రసారం అవుతున్న రామాయణాన్ని వీక్షించినట్లు ఉన్న సెహ్వాగ్‌.. ఈ మేరకు ఒక ఫోటోను పోస్ట్‌ చేశాడు.  సీత‌ను రావ‌ణుడు అప‌హ‌రించిన త‌ర్వాత సంధికోసం వెళ్లిన అంగధుడు అక్కడ ఉన్న లంకేయులతో సవాల్‌ చేస్తాడు. త‌న పాదాన్నిఎవరైనా కదిపితే.. శ్రీరాముడు ఓట‌మిని అంగీక‌రించిన‌ట్లే అని అంగ‌ధుడు అంటాడు. అయితే అంగ‌ధుడి పాదాన్ని క‌దిపేందుకు లంకేయులు ప్ర‌య‌త్నించి విఫలం అవుతారు. ఇదే విషయాన్ని తనకు ఆపాదించుకున్న సెహ్వాగ్‌ తన ఫుట్‌వర్క్‌ని ఏ ఒక్కరూ మార్చలేకపోయారని చెప్పకనే చెప్పేశాడు. 

మరిన్ని వార్తలు