ఇమ్రాన్‌ఖాన్‌పై సెహ్వాగ్‌ సెటైర్‌

3 Oct, 2019 20:56 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితితో భారత్‌పై విద్వేషం వెళ్లగక్కిన పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చాడు. తనను కించపరుచుకునేందుకు కొత్త మార్గాలు కనిపెట్టారంటూ ఇమ్రాన్‌ఖాన్‌పై ట్విటర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమెరికా వార్తా చానల్‌ ‘ఎంఎన్‌ఎస్‌బీసీ’తో ఇమ్రాన్‌ మాట్లాడిన వీడియోను పోస్ట్‌ చేసి సెటైర్‌ వేశాడు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో ఇమ్రాన్‌ఖాన్‌ పనికిమాలిన ప్రసంగం చేశారని, ఆయన తనకు తానుగా అవమానించుకున్నారనే అర్థం వచ్చేలా సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు.

గత నెల 26 జరిగిన ఐరాస సాధారణ సభ 74వ సమావేశాల్లో ఇమ్రాన్‌ఖాన్‌ మాట్లాడుతూ.. భారత్‌తో యుద్ధం వచ్చే అవకాశాలున్నాయని పరోక్షంగా వ్యాఖ్యానించారు. భారత్‌ సొంత విషయమైన ఆర్టికల్‌ 370 రద్దును అంతర్జాతీయ వేదికపై లేవనెత్తుతూ.. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. కశ్మీర్‌లో అమానవీయంగా కర్ఫ్యూ కొనసాగిస్తున్నారని, దానిని తక్షణమే తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఇమ్రాన్‌ఖాన్‌ వ్యాఖ్యలపై క్రికెటర్లు మహ్మద్‌ షమీ, హర్భజన్‌ సింగ్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ కూడా ఘాటుగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచేలా ఉన్నాయని, ఇటువంటి మాటలు ఇమ్రాన్‌కు తగవని హితవు పలికారు.

>
మరిన్ని వార్తలు