భారత్‌ – ఆసీస్‌ టీ20కి సన్నాహాలు

23 Jan, 2019 07:44 IST|Sakshi

వచ్చే నెల 27న మ్యాచ్‌

ఏర్పాట్లపై సమీక్షించిన కమిటీ

పర్యవేక్షణకు కమిటీల ఏర్పాట్లు

ప్రపంచ కప్‌కు ముందే విశాఖవాసులు క్రికెట్‌ విందు ఆస్వాదించనున్నారు. భారత్‌–ఆస్ట్రేలియా సిరీస్‌లో భాగంగా జరిగే రెండో టీ20 మ్యాచ్‌కు విశాఖ మహానగరం వేదికగా ఖరారైనవిషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌
నిర్వహక కమిటీ మంగళవారం సమావేశమై ఏర్పాట్లపై చర్చించింది. టికెట్లరేట్లు, ఎప్పటినుంచి విక్రయాలు ప్రారంభించాలన్న అంశాలపై చర్చించడంతోపాటు నిర్వహణకు సంబంధించిసబ్‌ కమిటీలను నియమించారు.

విశాఖ స్పోర్ట్స్‌: విశాఖలో, ఉత్తరాంధ్రలో క్రికెట్‌ వీరాభిమానులకు శుభవార్త! భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్‌ విశాఖలో వచ్చేనెల 27న జరగనుంది. భారత్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు ఇరు దేశాల మధ్య రెండో టీ20 మ్యాచ్‌ను విశాఖలోని వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఆడనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో రెండు టీ20 మ్యాచ్‌లు, ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. తొలి టీ20 మ్యాచ్‌ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఫిబ్రవరి 24న జరగనుంది. ఈ సిరీస్‌లో కేవలం రెండే టీ20 మ్యాచ్‌లు జరగనుండగా రెండో టీ20 మ్యాచ్‌కు  విశాఖ వేదికగా నిలిచింది. ఫిబ్రవరి 27న రాత్రి ఏడు గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇక వన్డే సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి వన్డే మార్చి రెండో తేదీన జరగనుండగా చివరిదైన ఐదో మ్యాచ్‌ మార్చి13న జరగనుంది.

మ్యాచ్‌ నిర్వాహక కమిటీ సమీక్ష : ఆస్ట్రేలియాతో జరిగే టీ20 మ్యాచ్‌ నిర్వాహక కమిటీ మంగళవారం ఇక్కడ సమావేశమైంది. టిక్కెట్లు, నిర్వహణ వ్యవహారాల చర్చించింది. కమిటీ చైర్మన్‌గా వీపీటీ చైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు వ్యవహరించనున్నారు. నిర్వహణకు సంబంధించి సబ్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. నగర పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ చంద్ర లడ్డా, వీపీటీ డెప్యూటీ చైర్మన్‌ హరినాథ్, జీవీఎంసీ అదనపు కమిషనర్‌ జీవీవీఎస్‌ మూర్తి,  ఈకో రైల్వే సహాయ క్రీడాధికారి శివహర్ష, కమర్షియల్‌ టాక్స్‌ విభాగం డిప్యూటీ సహాయ కమిషనర్‌ ఏఎన్‌వి ప్రసాద్, ఆర్టీసీ ఆర్‌ఎం అప్పలనాయుడు, ఏసీఏ అధ్యక్షుడు రంగరాజు, కార్యదర్శి అరుణ్‌కుమార్, వీడీసీఏ కార్యదర్శి పార్ధసారథి, ఏసీఏ మీడియా మేనేజర్‌ సీఆర్‌మోహన్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.  సబ్‌కమిటీల ప్రతినిదులు ఈనెల30న మరోసారి సమావేశమై మ్యాచ్‌ నిర్వహణకు స్టేడియం సన్నద్ధతపై చర్చించనున్నారు.

ఆన్‌లైన్‌ ద్వారా టిక్కెట్ల అమ్మకాలు
మ్యాచ్‌ను వీక్షించేందుకు టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఈవెంట్‌ నౌ వెబ్‌సైట్‌ ద్వారా విక్రయించనున్నారు.  రూ.500ను కనీస ధరగా రూ.1200, రూ. 1600, రూ. 2000, రూ. 4000 డినామినేషన్లలో టికెట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా