క్వార్టర్స్‌లో విష్ణువర్ధన్‌ జోడీ ఓటమి 

13 Mar, 2020 14:10 IST|Sakshi

ఐటీఎఫ్‌ పురుషుల టోర్నమెంట్‌  

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) పురుషుల టోర్నమెంట్‌లో టాప్‌ సీడ్‌ విష్ణువర్ధన్‌ జోడీకి చుక్కెదురైంది. కోల్‌కతా వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్‌ విభాగంలో విష్ణువర్ధన్‌–అర్జున్‌ ఖడే జంట క్వార్టర్స్‌లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో విష్ణువర్ధన్‌–అర్జున్‌ ఖడే (భారత్‌) ద్వయం 3–6, 4–6తో అభినవ్‌ షణ్ముగమ్‌–నితిన్‌ కుమార్‌ సిన్హా (భారత్‌) జోడీ చేతిలో ఓడిపోయింది.

అంతకుముందు తొలి రౌండ్‌లో 6–2, 6–0తో విఘ్నేశ్‌ పెరణమల్లూర్‌ (భారత్‌)–లుకాస్‌ రెనార్డ్‌ జోడీపై గెలుపొందింది. మరో క్వార్టర్స్‌ మ్యాచ్‌లో అనిరుధ్‌ చంద్రశేఖర్‌–కలియాంద పూనచా (భారత్‌) జంట 6–4, 4–6, 10–7తో వినాయక్‌ శర్మ కాజా–మనీశ్‌ కుమార్‌ (భారత్‌) జోడీపై గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టింది. సింగిల్స్‌ విభాగంలో విష్ణువర్ధన్, గంటా సాయి కార్తీక్‌ రెడ్డి తొలి రౌండ్‌లోనే వెనుదిరగగా... వినాయక్‌ శర్మ కాజా రెండో రౌండ్‌లో ఓటమి పాలయ్యాడు. విష్ణువర్ధన్‌ 7–5, 2–6, 0–3తో నితిన్‌ కుమార్‌ సిన్హా చేతిలో, సాయి కార్తీక్‌ 6–7, 4–6తో లుకాస్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో వినాయక్‌శర్మ కాజా 3–6, 1–6తో ఐడో సీడ్‌ ఎరిక్‌ వాన్‌షెల్‌బోయిమ్‌ చేతిలో ఓడిపోగా... నాలుగో సీడ్‌ అర్జున్‌ ఖడే 6–3, 6–4తో క్వాలిఫయర్‌ ప్రబోధ్‌ సూరజ్‌పై, ఏడో సీడ్‌ ఆర్యన్‌ 6–3, 6–1తో లుకాస్‌పై గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకున్నారు.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు