విష్ణువర్ధన్‌ జంటకు స్వర్ణం

9 Feb, 2018 10:42 IST|Sakshi
విష్ణువర్ధన్, నవనీత్‌లతో శాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వరరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఖేలో ఇండియా నేషనల్‌ స్కూల్‌ గేమ్స్‌లో తెలంగాణ క్రీడాకారులు ఆకట్టుకున్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ టోర్నీ బ్యాడ్మింటన్‌ ఈవెంట్‌లో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు. టోర్నీ చివరిరోజు గురువారం జరిగిన బ్యాడ్మింటన్‌ బాలుర డబుల్స్‌లో రాష్ట్రానికి చెందిన విష్ణువర్ధన్‌– నవనీత్‌ జంట విజేతగా నిలిచింది. ఫైనల్లో విష్ణు వర్ధన్‌– నవనీత్‌ (తెలంగాణ) జంట 23–21, 21–16తో అడ్వీస్‌– అరవింద్‌ (కేరళ) జోడీపై గెలుపొందింది.

సింగిల్స్‌ విభాగంలో తెలంగాణకే చెందిన సాయిచంద్‌ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. కాంస్య పతక పోరులో సాయిచంద్‌ 21–13, 21–17తో రోహన్‌ (మహారాష్ట్ర)పై విజయం సాధించాడు. మరోవైపు అథ్లెటిక్స్‌లోనూ తెలంగాణకు పతకం లభించింది. 400 మీ. పరుగులో శ్రీకాంత్‌ ద్వితీయ స్థానంలో నిలిచి రజతాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో తెలంగాణకు మొత్తం 5 పతకాలు లభించాయి. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారులను శాట్స్‌ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి, ఎండీ ఎ. దినకర్‌ బాబు అభినందించారు.

మరిన్ని వార్తలు