విష్ణు జంటకు టైటిల్‌

23 Jul, 2017 02:32 IST|Sakshi
విష్ణు జంటకు టైటిల్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రెసిడెంట్స్‌ కప్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ విష్ణువర్ధన్‌ డబుల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. కజకిస్తాన్‌లోని అస్తానా నగరంలో శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో విష్ణువర్ధన్‌ (భారత్‌)–తొషిహిదె మత్సుయ్‌ (జపాన్‌) జోడీ 7–6 (7/3), 6–7 (5/7), 10–7తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో ఎవ్‌గెని కర్లోవ్‌స్కీ–తుర్నెవ్‌ (రష్యా) జంటపై గెలిచింది.

గంటా 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో విష్ణు ద్వయం ఎనిమిది ఏస్‌లు సంధించింది. రెండు జోడీలు తమ సర్వీస్‌ను ఒక్కోసారి కోల్పోయాయి. అయితే నిర్ణాయక సూపర్‌ టైబ్రేక్‌లో విష్ణు జోడీదే పైచేయిగా నిలిచింది. ఈ సీజన్‌లో విష్ణుకిది రెండో ఏటీపీ చాలెంజర్‌ డబుల్స్‌ టైటిల్‌. గత నెలలో భారత్‌కే చెందిన శ్రీరామ్‌ బాలాజీతో కలిసి అతను ఫెర్గానా ఓపెన్‌ టైటిల్‌ను గెలిచాడు.

మరోవైపు అమెరికాలో జరుగుతున్న న్యూపోర్ట్‌ ఓపెన్‌ టోర్నీ సెమీఫైనల్లో లియాండర్‌ పేస్‌ (భారత్‌)–సామ్‌ గ్రోత్‌ (ఆస్ట్రేలియా) జంట 6–4, 6–7 (6/8), 9–11తో ఐజామ్‌ ఖురేషీ (పాకిస్తాన్‌)–రాజీవ్‌ రామ్‌ (అమెరికా) జోడీ చేతిలో ఓడిపోయింది.

మరిన్ని వార్తలు